Type Anything.., You Get World Wide Search Results Here. !

బాలకాండము - Balakandam

 బాలకాండము

శివ ధనుర్భంగము - రవివర్మ చిత్రం

అయోధ్య నగరం రాజధానిగా, కోసలదేశాన్ని ఇక్ష్వాకువంశపు రాజైన దశరథుడు పాలిస్తున్నాడు.కౌసల్య, సుమిత్ర, కైకేయి ఆయన భార్యలు. పిల్లలు లేని కారణంగా దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేశాడు. తరువాత ఆ రాజుకు నలుగురు బిడ్డలు జన్మించారు. వారికి రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అని నామకరణం చేశారు.


రావణుడు అనే వాడు బ్రహ్మవద్ద వరాలుపొంది దేవతలను జయించి మునులను వేధిస్తున్నాడు. వానికి దేవ గంధర్వ యక్ష రాక్షసుల వల్ల చావులేదు. దేవతల ప్రార్థనలు మన్నించి శ్రీ మహా విష్ణువు వానిని హతంచేయడానికి నరుడై జన్మింపనెంచాడు. విష్ణువు రామునిగా, ఆదిశేషుడు లక్ష్మణునిగా, శంఖ చక్రములు భరత శత్రుఘ్నులుగా అవతరించారు. శ్రీమహాలక్ష్మి సీతగా అయోనిజయై జనక మహారాజు ఇంట పెరుగుతున్నది. రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడు కిష్కింధలో ఉన్నాడు.


కులగురువు వశిష్టుని వద్ద రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు సకల విద్యలనూ అభ్యసించారు. ఒకనాడు విశ్వామిత్ర మహర్షి దశరథుని వద్దకు వచ్చి తన యాగసంరక్షణార్ధమై రామ లక్ష్మణులను తనతో పంపమని కోరాడు. ముక్కుపచ్చలారని నవయువకులను పంపడానికి దశరథుడు సంకోచించినా, వశిష్ఠుని సలహామేరకు విశ్వామిత్రునితో పంపాడు. విశ్వామిత్రుడు రామ లక్ష్మణులకు ఎన్నో అస్త్రవిద్యారహస్యాలను బోధించాడు. దారిలో రామ లక్ష్మణులు తాటకి అనే రాక్షసిని సంహరించారు. గంగానదిని దర్శించారు. రాముని పాదము సోకి అహల్యకు శాపవిమోచనమైనది.


రామ లక్ష్మణుల రక్షణలో యాగము జయప్రథముగా జరిగింది. మారీచ సుబాహులూ, ఇతర రాక్షసగణములూ దండింపబడ్డారు. తిరుగుదారిలో రామలక్ష్మణులు విశ్వామిత్రునితో కలసి జనకుని రాజధానియైన మిథిలానగరం చేరారు. అక్కడ సీతా స్వయంవరంలో రాముడు శివుని విల్లు విరచి, సీతకు వరుడైనాడు. సీతారాములు, ఊర్మిళా లక్ష్మణులు, మాండవీ భరతులు, శ్రుతకీర్తి శత్రుఘ్నుల వివాహం కనుల పండుగగా జరిగింది. తిరుగుదారిలో రాముని ఎదిరించిన పరశురామునకు తాము ఇద్దరూ విష్ణుస్వరూపులే అని తెలిసింది.


మహా వైభవముగా నలుగురు జంటలూ అయోధ్యకు తిరిగి వచ్చారు. అయోధ్యలో పాలన నిత్యకల్యాణముగా సాగుతున్నది.




Top

BOTTOM