Type Anything.., You Get World Wide Search Results Here. !

కేదార్ నాథ్ యాత్ర - Kedarnath Yatra

కేదార్ నాథ్ యాత్ర

కేదార్ నాథ్ భారతదేశంలోని ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగజిల్లాలో ఉన్నది. చార్ ధామ్ అనబడే నాలుగు క్షేత్రాలలోకి కేదార్ నాథ్ ఒకటి. ఈ కేదార్ నాథ్ యాత్ర ఎంతో ఆనందంగా ఉంటుంది. కేదార్ నాథ్ హిందువుల ముఖ్య పుణ్యక్షేత్రాలలో ఒకటి. సముద్రమట్టానికి 3584 మీటర్ల ఎత్తులో హిమాలయాలలో ఉన్నది. మందాకినీ నది పై భాగంలో మంచు కప్పిన కొండల మధ్య నెలకొని ఉన్నది.

కేదార్ నాథ్ వెళ్ళే దారిలో మోటారు వాహనాలు వెళ్ళ గల చివరి ప్రదేశం గౌరీకుండ్. ఇక్కడి నుండి నడిచిగాని, గుర్రాల మీదగాని కేదార్ నాథ్ చేరుకోవాలి. హిందువులు పవిత్రంగా భావించే కేదార్ నాథ్ శివాలయం ఉన్న గొప్ప పుణ్యక్షేత్రం. గుర్రాల మీద వెళ్ళేవారు గౌరీకుండ్ నుండి ఉదయం 7 గంటలకు బయలుదేరి, కేదార్ నాథ్ వెళ్ళి స్వామిని దర్శించి, సాయంత్రం చీకటి పడేలోపుగా గౌరీకుండ్ కు తిరిగి రావచ్చు.

గౌరికుండ్ నుంచి కేదార్ నాథ్ కు 14 కి.మీ. దూరం. గుర్రం మీద వెళితే సుమారు నాలుగు గంటలు పడుతుంది. పల్లకీలో వెళితే దాదాపు 5 గంటలు పడతుంది. పిట్టూలో వెళితే సుమారు ఆరు గంటలు పడుతుంది. అందువల్ల నడిచిగాని, పిట్టూలో గాని, వెళ్లేవారికి కేదార్లో రాత్రి బస తప్పనిసరి. ఎందుకంటే కేదార్ నాథ్ ఆలయం మధ్యాహ్నం ఒంటి గంటకు మూసివేసి, తిరిగి సాయంత్రం నాలుగు, అయిదు గంటల మధ్య తెరుస్తారు.

ఈ కేదారేశ్వర ఆలయం, మేష సంక్రమణం రోజున అంటే సూర్యుడు మేషరాశిలో ప్రవేశించే రోజున తెరుస్తారు. ఇది వైశాఖమాసంలో, అనగా ఏప్రిల్ నెల ఆఖరి వారంలోగాని, మే నెల మొదటివారంలో గాని వస్తుంది. తిరిగి వృశ్చిక సంక్రమణం రోజున, అంటే సూర్యుడు వృశ్చిక నక్షత్రంలో ప్రవేశించే రోజున మూసివేస్తారు. ఇది సాధారణంగా కార్తీక మాసంలో అంటే అక్టోబర్ నెల ఆఖరు వారంలోగాని, నవంబర్ నెల మొదటి వారంలోగాని వస్తుంది. ఈ స్వామివారు ఆరు నెలలు మానవుల పూజలను అందుకుంటే మిగిలిన ఆరు నెలలు దేవతల పూజలు అందుకుంటారని చెబుతారు.

ఆలయం మూసివేయగానే స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని కేదార్ కు 52 కి.మీ. దూరంలో ఉన్న ఉఖీమఠ్ లో ఉన్న ఆలయానికి ఊరేగింపుగా తీసుకువెళతారు. ఆ ఆలయంలో ఒక ప్రత్యేక మందిరము, అందులో ఒక సింహాసనమూ ఉన్నాయి. చలికాలం ఆరునెలలూ, స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఆ సింహాసనం మీద ప్రతిష్టించి నిత్యపూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ ఆలయ ప్రాగణంలో ఒక బ్రహ్మాండమైన నంది విగ్రహం ఉన్నది. ఈ నంది సజీవ ఆకృతిని కలిగి ఉంటుంది. ఈ దేవాలయం గోడలనిండా దేవతల శిల్పాలు తీర్చిదిద్దబడి ఉన్నాయి.

పురాణ ప్రాశస్త్యం:
కేదారేశ్వర లింగం గురించి ఒకమాట చెప్తారు.
మహాద్రి పార్శ్వే చ తటే రమంతం, సంపూజ్యమానం సతతం మునీంద్రైః 
సురాసురైర్యక్షమహోరగాద్యైః కేదారమీశం శివమేకమీడే!! 
(ద్వాదశ జ్యోతిర్లింగస్తోత్రం – ౧౧)

ఇది హిమాలయ పర్వతములలో వెలసిన లింగము. నరనారాయణులిద్దరూ కూడా సాక్షాత్తుగా ఈ భూమండలం మీద బదరీక్షేత్రము నందు తపస్సు చేసినప్పుడు ద్యోతకమయిన శివలింగము. కేదారము నందు ఉన్న శివలింగమును దర్శనం చేసినా, చేయడానికి వెడుతున్నప్పుడు మరణించినా మోక్షమే!

కేదారేశ్వరంలో నరనారాయణులు ఒక పార్థివ లింగమును ఉంచి ఆరాధన చేస్తూ ఉండేవారు. పార్థివ లింగము అంటే మట్టితో చేసిన శివలింగం. మట్టితో చేసిన ఆ శివలింగమును వారు సాక్షాత్తు ఈశ్వరుడు అని నమ్మి శివలింగమునకు అర్చన చేస్తున్నారు. అపుడు ఆ శివలింగం లోంచి పరమశివుడు ఆవిర్భవించి "మీరు చేసిన పూజకు నేను ఎంతో పొంగి పోయాను. ఇంత చల్లటి ప్రాంతంలో ఇంత తపస్సులో పార్థివ లింగమునకు ఇంత అర్చన చేశారు. మీకేమి కావాలో కోరుకోండి" అని అడిగారు. అపుడు వారు "స్వామీ.. ఇక్కడే ఈ బదరీ క్షేత్రమునకు ఆవలివైపు హిమాలయ పర్వతశృంగముల మీద నీవు స్వయంభువ లింగమూర్తివై వెలసి లోకమును కాపాడు" అని అడిగారు. వారి కోరిక ప్రకారం స్వామి అక్కడ వెలిశాడు. 

తమ బంధు జనులను సంహరించిన పాపాన్ని తొలగించుకోవడానికి శ్రీకృష్ణుడి సలహా మేరకు పాండవులు కాశీ క్షేత్రానికి వెళ్లారట. పరమేశ్వరుడు వారికి దొరక కూడదని కేదార క్షేత్రానికి వెళ్ళిపోయాడట. ఈ విషయం తెలుసుకున్న పాండవులు శివ స్పర్శకై కేదారం వెళ్లారట. అప్పటికి కేదార ఆలయంలో చిన్న శివలింగం మాత్రమే మిగిలి ఉంది. ఎందుకంటే అక్కడ శివలింగం వెలిసి కొన్ని యుగములు అయిపొయింది. శివాలయములో శివునికి పునఃప్రతిష్ఠ ఉండదు. కాబట్టి అప్పటికి చిన్న లింగం మాత్రమే మిగిలి ఉంది. పాండవులు ఏమి చేస్తారో చూడాలని శివునికి ఒక ముచ్చట కలిగి, చిన్న దున్నపోతు రూపంలో పరుగెత్తాడట. పాండవులు దానిని గమనించారు. వారు అది ఖచ్చితంగా శంకరుడే అయి ఉంటాడని భావించారు. మహిష రూపంలో వెళుతున్నా అంతటా ఈశ్వర దర్శనం చేశారు పాండవులు. కేదారం వెళ్లి వచ్చిన వాడికి అంతటా శివుణ్ణి చూడడం అభ్యాసంలోకి రావాలి. అంత పరమ పావన మయిన క్షేత్రం కేదార క్షేత్రం. పాండవులు ఆ లింగం మాత్రమే శివుడు అనుకోలేదు. మహిషంలో కూడా శివుడిని చూసారు. అందుకే దాని కాళ్ళు పట్టుకోవాలని వారు మహిషం దగ్గరికి వెళ్ళారు. వాళ్లకి మహిషం కాళ్ళు అందలేదు. తోక అందింది. ఈశ్వర స్వరూపంగా దాని తోక పట్టుకున్నారు. వాళ్ళ భక్తికి మెచ్చుకున్నవాడై పరమేశ్వరుడు తన పృచ్ఛభాగమును అక్కడ విడిచిపెట్టి దానిని శివలింగంగా మార్చి వేశాడు. అదే ఇప్పుడు మనందరం దర్శనం చేస్తున్న కేదారలింగం. పాండవులు మహిష రూపంలో ఉన్న శంకరుని తోక భాగం పట్టి లాగడంతో స్వామి పృచ్ఛ భాగం ఎర్రగా కమిలిపోయిందట. అందుకే ఆవునేతితో స్వామి అభిషేకం చేస్తారు అక్కడ. ఆ అభిషేకం చేసిన నేతిని మనం ప్రసాదంగా ఇంటికి తెచ్చుకోవచ్చు. ఎలాంటి నొప్పులు అయినా ఆ నేతితో మర్దనా చేస్తే తగ్గిపోతాయట.

కేదారనాథ్ ఆలయం:
అత్యున్నతమైన ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది మొట్టమొదటిది. అతి పురాతన శివలింగాలలో ఇది ఒకటిగా వెలుగొందుతుంది. కేదార్ నాథ్ ఆలయము ఆది శంకరులచే 8వ శతాబ్ధంలో పునర్ నిర్మించబడిన శివాలయం. సుమారు 1000 సంవత్సరాల పురాతన చరిత్ర కలిగిన ఈ ప్రస్తుత ఆలయాన్ని దీర్ఘచతురస్రాకార స్థావరం మీద పెద్ద రాతి కట్టడాలను ఉపయోగించి నిర్మించారు. భక్తులు ఈ పుణ్యక్షేత్రంకు వెళ్ళే మెట్లపై పాళీ భాషలో రాసిన శాసనాలు ఎన్నో ఉన్నాయి. 

గౌరీకుండ్ చేరగానే మొదటనే, చిన్న విశాలమైన ప్రదేశం ఉంది. బస్సులు, మిగిలిన వాహనాలు ఈ ప్రదేశంలో నిలిపి ఉంచుతారు. ఈ చిన్న మైదాన ప్రదేశానికి ఆ చివర, అంటే మెట్లదారి ప్రారంభమయ్యేచోట ఒక చిన్న పార్వతి దేవి ఆలయం ఉన్నది తప్పకుండా దర్శించుకోండి. 

షాపులు, హోటళ్ళ మధ్య నుంచి సాగుతూ వెళ్ళే మెట్ల మార్గం సుమారు అర కి.మీ. దూరం తరువాత అంతం అవుతుంది. ఆ చివర, ఇళ్ళ మధ్య కొంచెం విశాలంగా ఉన్నచోట రెండు ఉష్ణకుండాలు ఉన్నాయి. అందులో ఒకటి స్త్రీలకు రెండవది పురుషులకు. కుమార స్వామికి జన్మనిచ్చిన తరువాత గౌరీదేవి ఈ కుండంలో స్నానం చేసిందని స్థలపురాణం. 

గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్ వరకూ ప్రయాణం మందాకిని నది ఒడ్డు వెంబడే సాగుతుంది. గౌరీకుండ్ నుండి బయలుదేరిన రెండు గంటల తరువాత 'రాంబాడ' అనే చోటుకు చేరతాం. గౌరీకుండ్ నుంచి రాంబాడ సరిగ్గా 7కి.మీ. దూరం. గౌరీకుండ్ సముద్రమట్టం నుంచి 1982 మీటర్ల ఎత్తులో ఉంది. రాంబాడా ఎత్తు 2591 మీటర్లు. రాంబాడ నుండి మరొక 4 కి.మీ. దూరం వెళితే 'గరుడచట్టి' అనే ప్రదేశం వస్తుంది. ఈ గరుడచట్టి సముద్రమట్టానికి 3262 మీటర్ల ఎత్తులో ఉంది. గరుడచట్టి దాటగానే ఆ ఊరి బయటనుంచే కేదార్ నాథ్ కనిపిస్తూ ఉంటుంది.

గరుడచట్టి నుంచి కేదార్ నాథ్ 3 కి.మీ. దూరంలో ఉన్నది. కేదార్ నాథ్ చుట్టూ గుర్రపునాడా ఆకారంలో కొండలు పరచుకుని ఉన్నాయి. మధ్యలో ఉన్న లోయ వంటి ప్రదేశంలో కేదార్ నాథ్ ఆలయమూ, దాని చుట్టూ చిన్న ఊరు ఉన్నాయి. ఊరుకు చిట్ట చివర ఒక ఆలయం ఉంది. ఆలయమూ, దాని చుట్టు ఉన్న ప్రాంగణమూ మొత్తము వీధికంటే సుమారు 10 అడుగుల ఎక్కువ ఎత్తులో ఉన్నాయి.

ఆలయం ముందు సుమారు 30 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పు ఉన్న ప్రాంగణం ఉన్నది. ఆలయానికి మిగిలిన మూడు వైపులా సుమారు 15 అడుగుల వెడల్పు ఉన్న ప్రదక్షిణ మార్గం ఉన్నది. ఆలయం పైన, ముందుభాగం మొత్తమూ రేకుల షెడ్డు.. రెండు ప్రక్కలకూ క్రిందకు వాలి ఉంటుంది. వెనుకవైపు గర్భాలయంపైన పది అడుగుల చదరంగా ఉన్న విమానమూ, చిన్న శిఖరము ఉన్నాయి. ఆలయం ముందు భాగం 30 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పు ఉన్నది. మధ్యలో 15 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు ఉన్న ప్రవేశ ద్వారం ఉంది. ఆలయంలోకి ప్రవేశించగానే, ముందుభాగంలో ఒక చిన్న ముఖమంటపమూ, ముఖమంటపదాటి లోపలకు వెళితే, గర్భాలయం వస్తుంది. ఈ గర్భాలయం సుమారు 25 అడుగుల చదరంగా విశాలంగా ఉన్నది.

ఎడమవైపు గోడలో బదరీనారాయణుని యొక్క మూర్తి ఉన్నది. స్థలపురాణం ప్రకారం ఈ కేదార్ నాథ్ ఉన్న ప్రదేశానికే కాక, బదరీ నాథ్ ఉన్న ప్రదేశానికి కూడా ఈ కేదార్ నాథుడే అధిపతి. నరనారయణులు ఈ ప్రదేశానికి వచ్చి, ప్రస్తుతం బదరీనాథ్ ఉన్న ప్రాంతం తాము తపస్సు చేసుకోవడానికి అనుకూలంగా ఉందని భావించి, దానికి ఈ కేదార్ నాథుని అనుమతి పొంది తపస్సు ఆచరించారట. ఆ కారణం చేతనే ఈ ఆలయం లోపల బదరీనాథుని మూర్తి ఉన్నదని కొంతమంది అభిప్రాయం.

గర్భలయానికి మధ్యలో సుమారు 8 అడుగుల చదరంగా ఉన్న పానవట్టంలో, కేదారేశ్వరుని లింగ మూర్తి ఉన్నది. స్వామి త్రిగుణాకారంలో స్వయంభువుగా లింగరూపంలో కేదారేశ్వరుడిగా కొలువై పూజింపబడుతున్నారు.
ఈ విగ్రహమూర్తి ఆకారం కొంచెం మార్పుగా ఉంటుంది. మాములుగా మనం చూసే శివాలయాలలో లింగాకారంలా ఉండదు. 3 అడుగుల ఎత్తు ఉండి, ఉపరితలం నున్నగా కాకుండా, గరుకుగా ఉంటుంది. ఆలయంలోకి ప్రవేశించిన తరువాత కుడి ప్రక్క గణేషుడు, ఎడమప్రక్క పార్వతిదేవి, వెనుకవైపు శ్రీకేదారేశ్వరస్వామి వారు ఉన్నారు. త్రిగుణాకారుడైన ఈ స్వామిని దర్శించినంతనే అన్ని కష్టాలు మరచిపోతారు.

ఆలయం ముందుభాగంలో కుంతిదేవి, పంచపాండవులు, శ్రీకష్ణుని మూర్తులు గోడలపై వరుసగా కుడ్య విగ్రహాలుగా దర్శనమిస్తాయి. పాండవులు కుంతిదేవితో కలిసి ఇక్కడ ఉన్న కేదారేశ్వరుని తరచుగా పూజించేవారు. అందువలన వారి విగ్రహాలు ఆలయంలో ఉన్నట్లు కొందరి అభిప్రాయం. పాండవులచే నిర్మించబడిన ఈ ఆలయం 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులవారిచే పునర్నిర్మించబడినది అని చెబుతారు.


ఆలయం లోపల ముందు హాలులోని గోడలపై వివిధ దేవతామూర్తుల విగ్రహాలు చెక్కబడి, పురణాల ఇతిహాసాల ఘట్టాలను తెలియజేస్తున్నాయి. గ్రే కలరు రంగు రాళ్ళతో అతి పెద్దగా, బలంగా, ఎంతో అద్భుతంగా ఈ ఆలయం నిర్మించబడింది. దాదాపు 1000 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయం ఎటువంటి సౌకర్యాలు లేని ఆ రోజుల్లో ఏవిధంగా నిర్మింపబడిందో అనే విషయం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.


పూజా కార్యక్రమాలు:
కేదారేశ్వరస్వామి రెండుసార్లు రెండు విధాలుగా పూజింపబడతాడు. ఉదయం పూట బాలభోగ్ అష్టోత్తరం, మహాభిషేకం మొదలైన పూజలు ఎన్నోచేస్తారు. ఇలా ఉదయం పూట జరిగే పూజలను నిర్వాణపూజ అంటారు.

కేదార్ నాథ్ ఆలయం మధ్యాహ్నం ఒంటిగంటకు మూసివేసి, తిరిగి సాయంత్రం నాలుగు, అయిదు గంటల మధ్య తెరుస్తారు.

సాయంకాలం జరిగే పూజను శృంగార పూజ అంటారు. సాయంకాలం నుండి రాత్రి వరకు స్వామివారిని అందమైన పూలతో అలంకరిస్తారు. కేదార్ నాథ్ లో 4 లేక 5 గంటలకే చీకటి పడుతుంది. చీకటి పడిన తరువాత ఆలయం ప్రాంగణం అత్యద్భుతంగా ఉంటుంది. కేదారేశ్వరస్వామి వారికి 6 గంటల నుండి 7 గంటల వరకు విశేష హారతిని ఇస్తారు. ఆలయం లోపల హారతిని ఇస్తుంటే, ఆలయం వెలుపల సాధువులు శంఖం పూరిస్తుంటారు. రాత్రి సమయమున స్వామివారికి అర్చనలు ఉండవు. అలంకార మూర్తుడైన స్వామి దర్శనం మాత్రమే లభ్యమవుతుంది.

కేదార్ నాథ్ లో చూడవలసిన ఇతర ఆలయాలు:

ఈశానేశ్వర్ మహాదేవ్: 
కేదారేశ్వర్ ఆలయము బయట ఆవరణలోనే ఈశానేశ్వర్ మహాదేవ్ స్వామివారి చిన్న ఆలయం ఉన్నది. భక్తులు కేదారేశ్వరుడిని దర్శించిన తరువాత ఈశానేశ్వర్ ఆలయాన్ని దర్శిస్తారు.

భైరవ ఆలయం:
కేదార్ నాధ్ ఆలయానికి ఒక కిలోమీటరు దూరంలో భైరవుని ఆలయం ఉంది. 6 నెలల పాటు కేదారేశ్వరుని ఆలయం మూసివేసిన సమయంలో ఈ భైరవుడే కేదారనాధుని ఆలయాన్ని సంరక్షిస్తాడట. ఈ ప్రదేశం నుండి మొత్తం కేదార్ నాథ్ వ్యాలీ మొత్తం కనిపిస్తుంది. 


ఆదిశంకరాచార్యుని సమాధి: 
శ్రీ కేదారేశ్వర స్వామి ఆలయానికి వెనుకవైపున సుమారు 100మీటర్ల దూరంలో ఒక రేకుల షెడ్డు ఉన్నది. దీనినే శంకరాచార్య సమాధి అంటారు. షెడ్డు చెక్క స్తంభాలతో నిర్మించబడింది. పైన ఇనుపరేకులు, లోపల ఆదిశంకరాచార్యుల వారి విగ్రహమూర్తి ఉన్నది. అయితే శంకరాచార్యుల వారు కేదార్ నాథ్ లోని ఒక గుహ లోపలికి వెళ్ళి కనిపించకుండా అదృశ్యమైనారని కొందరంటారు. ఆయన కంచిలో సమాధి చెందారనేది మరొక వాదన.

శంకరాచార్యులవారు అద్వైత సిద్ధాంతాన్ని భారతదేశం నలువైపులా ప్రచారం చేసిన జ్ఞాని. పురాణాల ప్రకారం అతడు బదరీనాథ్ యొక్క జ్యోతిమఠ్ ఆశ్రమం నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించి, చివరగా కేదార్ నాథ్ పర్వతాలకు వెళ్ళారు. శంకరాచార్యులవారి నలుగురు ప్రియశిష్యులు అతనిని అనుసరించారు. కానీ వారిపై శంకరాచార్యులు ఒత్తిడి తెచ్చి వారిని పంపి వేసి తను ఒంటరిగానే బయలుదేరారు. శంకరాచార్యులవారు తన 32వ ఏటనే సమాధి సిద్ధి పొందారు. శంకర భగవత్పాదులు అక్కడే తమ సత్యదండమును విడిచిపెట్టేశారు అని భక్తులు నమ్ముతుంటారు. అక్కడ శంకరుల సత్యదండపు పెద్ద ఫోటో ఒకటి ఉంటుంది. అక్కడే చిన్న ఆలయం కూడా ఉంటుంది. 2013 లో వచ్చిన వరదలలో ఆదిశంకరాచార్యుల సమాధి కట్టడం కొట్టుకుపోయింది. 

ద్వాపరయుగంలో పాండవులు తమ పాపములను తొలగించిన స్వామిపై భక్తితో అత్యద్భుతంగా ఆలయాన్ని నిర్మించారు. ఆ తరువాత కొన్నివేల సంవత్సరాల అనంతరం ఆదిశంకరాచార్యుల వారు తన శేషజీవితాన్ని ఇక్కడే తపస్సులో గడిపి సమాధి అయినారని తెలుస్తుంది. ఈ ప్రాంతంలో వేడినీటి బుగ్గను చూడవచ్చు.

పంచ పర్వతాలు: 
కేదార్ నాథ్ ఆలయానికి వెనుకగా సుమారు 2 కి.మీ దూరంలో, అడ్డంగా పరుచుకుని ఉన్న ఒక కొండల వరుస కనిపిస్తూ ఉంటుంది. వంతెన ప్రక్క నుంచి మందాకిని నది ఒడ్డునే, ఆ కొండల వరకూ ఉన్న మార్గం కూడా చూడవచ్చు. మందాకిని నది ఆ కొండలలో నుండి రెండు ధారలుగా వచ్చి, ఆ కొండల క్రింద ప్రాంతములో కలిసిపోయి, ఒకే ప్రవాహంగా ముందుకుసాగుతూ వస్తుంది. 

ఆ కొండల వరుసను రుద్ర హిమాలయాలు అని అంటారు. వాటినే సుమేరు పర్వతాలనీ, పంచ పర్వతాలు అని కూడా అంటారు. ఇవి వరుసగా రుద్ర హిమాలయం, విష్ణు పురి, బ్రహ్మపురి, ఉద్గరికాంత, స్వర్గారోహణ అనే పేర్లు కలిగి ఉండటం వలన వీటికి పంచపర్వతాలు అని పేరు వచ్చినది. పాండవులు స్వర్గానికి బయలుదేరి వెళుతూ ఉండగా, ధర్మరాజు తప్ప, మిగిలిన సోదరులు, ద్రౌపది స్వర్గారోహణ అనే ఈ పర్వతం మీదనే ఒక్కొక్కరుగా నేలకు ఒరిగారు. ఈ స్వర్గారోహణ అనే పర్వతానికి చేరే దారిలోనే 'మహాపధ్' (మహాపంత్) అనే చిన్న శిఖరం ఉన్నది. ఇది దాటితే స్వర్గారోహణ పర్వతం కన్పిస్తుంది.

బుగ్గ ఆలయం: 
శ్రీ కేదారేశ్వరస్వామిని దర్శించుకున్న తరువాత ఆలయానికి ఎదురుగా కుడివైపుగా తిరిగి 2 కి.మీ. దూరం ముందుకువెళితే ఈ బుగ్గ ఆలయంను దర్శించవచ్చును. ఈ ఆలయాన్ని ఓం నమశ్శివాయ ఆలయం అని కూడా అంటారు. ఈ ఆలయంలో స్వామి మూర్తి ఎదురుగా నాలుగు పలకల నీటి కుండం ఉన్నది. ఆ కుండం వైపు వంగి ఓం నమశ్శివాయ అంటే నీటి బుడగలు వస్తాయి. ఓం నమశ్శివాయ అనే శంకరుని నామం నిత్యం వినబడే ఆ ప్రదేశంలో బుడగలు నిరంతరం వస్తూనే ఉంటాయి.

అగస్త్యేశ్వర మందిరం: 
అగస్త్యేశ్వర ముని నివాసం అనే ఆలయం కేదార్ నాథ్ లోని మందాకిని నది ఒడ్డున 1000మీ. ఎత్తులో ఉన్నది. ఈ ప్రదేశాన్ని అగస్త్యముని నిత్యం ధ్యానం చేసుకున్న ప్రదేశంగా చెబుతారు. ఇచ్చట ఉన్న ఆలయాన్ని స్థానికులు అగస్త్యేశ్వర్ మందిర్ అని పిలుస్తారు. ఈ ఆలయంలో గోడలపైన ప్రసిద్ధ హిందూ దేవతామూర్తులు ఉన్నారు. ఇచ్చట “బైశాఖి” పండుగను చాలా ఆనందంగా, ఉత్సాహంతో జరుపుకుంటారు.

రేతకుండము: 
కేదార్ నాథ్ చుట్టుప్రక్కల ప్రదేశాలలో చాలా కుండాలు ఉన్నాయి. ఆ కుండాలు అన్నింటిలోకి రేతకుండము చాలా ప్రసిద్ధి చెందిన కుండము.

ఇంకా శివకుండము, భృగు కుండము, రుధిర కుండము, వహ్ని తీర్థము, హంసతీర్థము అనేవి కూడా ఇచ్చట ఉన్నాయి. ఇవన్నీ కేదారేశ్వరుని ఆలయానికి దక్షిణంగా, మందాకిని నది ఒడ్డునే ఉన్నాయి.

గాంధీ కుండం:
 ఈ కుండం వద్దనే పాండవాగ్రజుడు అయిన ధర్మరాజు స్వర్గానికి ఇంద్రుని విమానం ఎక్కాడట. గాంధీ గారి అస్థికలు ఈ కుండంలోనే కలిపారట. అందుకే దీన్ని గాంధీ కుండం అని వ్యవహరిస్తున్నారు. 

దూద్ గంగ:
ఆలయానికి ముందు, అనగా ఊరు మొదటనే ఉన్న వంతెనకు ఎడమవైపు ఉన్న ఒక కొండమీద నుండి, ఒక జలపాత ధార తెల్లని పాలలాగా మెరుస్తూ క్రిందకు దిగివచ్చి, మందాకిని నదిలో కలసిపోవడం మనం చూడవచ్చు. దీనిని దూద్ గంగ అని అంటారు.

ముగింపు:
హిమాలయ పర్వతములు సముద్ర మట్టమునకు కొన్ని వేల అడుగుల ఎత్తులో ఉన్నాయి. కేదారం వెళ్ళడానికి దారి కొన్ని నెలలలో మాత్రమే వీలు చేయబడుతుంది. రాత్రి తొమ్మిది దాటితే ఆ మార్గ ప్రాంతంలో కరెంటు తీసివేస్తారు. అక్కడి కాటేజీలలో చీకట్లోనే పడుకోవాలి.

అక్కడ ప్రయాణం చేయాలి అంటే పాదచారియై వెళ్ళాలి. మంచు హోరుమని వానలా పడిపోతుంది. పైనుంచి క్రిందకి చూశారంటే కళ్ళు తిరిగిపోతాయి. సాధారణంగా ఆ మార్గంలో నడిచి వెళ్ళే వాళ్ళు తక్కువ. డోలీ, లేదా గుర్రముల మీద కూర్చుని వెళ్ళాలి. గుర్రం ఒక్కసారి జారిందంటే ఇక గుర్రం మీద కూర్చున్న వాడిని వెతకవలసిన అవసరం ఉండదు. అలా జారితే వాడు కొన్నివేల అడుగుల నుండి క్రింద పడిపోతాడు. శరీరం చిన్నాభిన్నం అయిపోతుంది. 

యాత్రలో ఎన్ని కష్టములు ఉన్నప్పటికీ కేదారనాథ్ యాత్ర వెళ్ళితీరవలసిన యాత్ర. ఇన్నివేల అడుగులు పైకి ఎక్కిన తర్వాత స్వామి దేవాలయం కనపడుతుంది. లోపలికి వెళితే లోపల పెద్ద అంతరాలయం ఉంటుంది. అక్కడ మహానుభావుడు కేదారేశ్వరుడుగా వెలిశాడు. కేదార శివలింగ దర్శనం చేసిన వాడికి మోక్షం కరతలామలకము అని శివమహాపురాణం చెప్తుంది. కేదారం వెళ్ళినపుడు చనిపోయిన వారికి కూడా మోక్షం దొరికి తీరుతుంది.

అక్కడే మనం కొండ ఎక్కుతున్నప్పుడే దూరంగా కైలాస దర్శనం అవుతుంటుంది. అదిగో కైలాసం కనపడుతోంది చూడండి అంటారు. ఆ మంచుకొండ నిజంగా కైలాసంలాగే భాసిస్తూ ఉంటుంది. వర్షం ఆగి సూర్య కిరణములు పడుతుంటే ఆ దృశ్యం చూడడానికి చాలా అందంగా ఉంటుంది. కైలాస సమీపమునకు వెళ్లి వచ్చినట్లు అనిపిస్తుంది. 

కేదారేశ్వర లింగమును దర్శనం చేసేటప్పుడు ఒక నియమం ఉంది. ఆ నియమంతోనే దర్శనం చేయాలి. కేదార లింగమును తిన్నగా కంటితో చూడకూడదు. వలయమును పట్టుకు వెళ్ళాలి. వలయము అంటే చేతికి వేసుకునే కంకణం వంటి గుండ్రని వస్తువును తీసుకువెళ్ళాలి. అంతరాలయంలో ప్రవేశించగానే కంటిముందు ఆ వలయమును పెట్టుకుని అందులోంచి చూడాలి. కేదారము దర్శనము చేత మోక్షమీయగలిగిన క్షేత్రం కనుక సమస్త బ్రహ్మాండము నిండినవాడు వీడే అని తెలుసుకోవడానికి కంటికి అడ్డంగా ఒక వలయాకరమును పెట్టుకుని అందులోంచి కేదార లింగమును చూడాలి. అలా చూసిన వలయ కంకణమును అక్కడ వదిలిపెట్టి వచ్చెయ్యాలి. మన చేతికి ఉన్న ఏ బంగారు కంకణమునో ఉపయోగించినట్లయితే దానిని అక్కడ వదిలిపెట్టేయడానికి మనసొప్పదు. కాబట్టి ముందే ఒక రాగి కంకణమును పట్టుకుని వెడితే రాగి చాలా ప్రశస్తము కనుక, ఆ కంకణములోంచి కేదార లింగమును దర్శనం చేసి దానిని అక్కడ వదిలిపెట్టి రావచ్చు.

స్మరణ మాత్రం చేతనే మోక్షం ఇవ్వగలిగినవాడు కేదారేశ్వరుడు. ప్రతీ రోజూ ఉభయ సంధ్యల యందు "ఓం కేదారేశ్వరాయ నమః" అని మూడు సార్లు పలికితే చాలు... స్వామి పొంగిపోతారట. 


***సర్వం శ్రీపరమేశ్వర పరబ్రహ్మార్పణమస్తు***

Top

BOTTOM