Type Anything.., You Get World Wide Search Results Here. !

మాఘ ఆదివారం నోము - Maaga Aadi Varam

మాఘ ఆదివారం నోము

కథ :-

ఒకానొక గ్రామంలో 'లచ్చుమమ్మ' అనే సంపన్నగేస్తురాలు మాఘ ఆదివారం నోము పట్టి, కథ వినమని పెనిమిటిని అడుగగా, "పెద్దవీథిలో పనివుందని" వెళ్ళి పోయాడు. కథ వినమని కొడుకులని అడుగగా “కొలువుకెళ్ళా” లని వెళ్ళిపోయారు. కథ వినమని కోడళ్ళని అడుగగా “ఇంటి పనులున్నాయి-వంట పనులున్నా" యని ఈసడించి వెళ్లిపోయారు. కథ వినమని మనుమలని అడగ్గా వారు “గురువుగారు కోపపడతా” రంటూ పాఠ్యగ్రంథాలతో విద్యాపీఠానికి వెళ్ళిపోయారు. కథ వినమని మనుమరాళ్ళని అడుగగా "ఆనక వింటాం" లెమ్మని ఆటల్లో మునిగిపోయారు.

ఆరోజు పెద్దబజారులో లచ్చుమమ్మ పెనిమిటికి పరాజయం సంభవించింది. కొడుకులకు కొలువులో అమర్యాద జరిగింది. కోడళ్ళకు పనులలో ఆటంకాలు కలిగాయి. మనుమలకు విద్యలో రాణింపు తగ్గింది. మనుమరాళ్ళకు ఆటలలో గాయాలయ్యాయి. అన్నింటికీ కారణం లచ్చుమమ్మ చెప్పే కథ వినకపోవడమేనని నిశ్చయించుకుని - అందరూ ఇంటికి వచ్చే సరికి - కథ వినేవాళ్ళను వెతుక్కుంటూ లచ్చుమమ్మ గ్రామంలోకి వెళ్ళింది.

నీలాటిరేవులో వాళ్ళకు కథ చెబుతానంటే వాళ్ళు వినలేదు. ఫలితంగా వారు తీసుకెళ్లే నీళ్ళకుండలు పగిలిపోయాయి. అంతలో ఎదురైన యాయవారపు బ్రాహ్మణున్ని కథ వినమనగా, “యాయవారానికి వేళమీరిపోతోందని వెళ్ళిపోయాడు. ఆరోజతనికి పిడికెడు గింజలయినారాలలేదు. అలా లచ్చుమమ్మ - కనబడిన ప్రతీవాళ్ళనీ కథ వినమనడం, వాళ్ళు వినకపోవడం - తత్ఫలంగా ఏదో ఆపదపాలవుతూండడం జరుగుతోంది. చివరగా లచ్చుమమ్మ ఊరి చివరి ఉప్పరి సోదెమ్మ వద్దకు వెళ్ళి కథ వినమనగా - ఆమె "అమ్మా! నేనసలే గర్భిణిని. నిన్న ఒంటిపూటనే తిన్నాను. ఈనాడు చూడబోతే ఆదివారమయ్యింది. అందువల్ల - మానెడు పాలలో చారెడు బియ్యంవేసి పరమాన్నము వండిపెడితే - అది తిని నీకథ వింటా”నంది.

లచ్చుమమ్మ వెంటనే పరమాన్నము వండి, ఉప్పరి సోదెమ్మకు పెట్టి కథ వినమనగా - “చెప్పుచెప్పు” మంటూనే ఆమె నిద్రలోకి జారుకుంది. అప్పుడామె కడుపులో బిడ్డ “లచ్చుమమ్మ తల్లీ! లచ్చుమమ్మ తల్లీ! మాయమ్మ కడుపుమీద కాసిన్ని అక్షంతలు వేసి కథ చెబితే - కడుపులో వున్న నేను వింటాను" అంది. 'సరే'నని, లచ్చుమమ్మ అలాగే అక్షంతలు వేసి, కథ చెప్పి, ఉప్పరి సోదెమ్మ నిద్రలేచేదాకా కూర్చుంది. ఆమె నిద్రలేచి - నిద్దరోయినందుకు క్షమాపణ కోరి, కథ చెప్పమని అడగగా, లచ్చుమమ్మ నవ్వి- "యోగంవున్న నీకడుపులో బిడ్డ కథవినడం జరిగింది. పుట్టబోయే బిడ్డని మాత్రం నాకు ఇచ్చేయాలి” అని కోరగా, ఉప్పరి సోదెమ్మ ఒప్పుకుంది. ఒప్పందం ప్రకారం - తనకు పుట్టిన ఆడపిల్లను, లచ్చుమమ్మకు అప్పగించింది. లచ్చుమమ్మ ఆపిల్లని ఎత్తుకుని నిర్జన ప్రాంతానికి వెళ్లి, అక్కడో చెట్టుకు ఉయ్యాల వేసి, అందులో బిడ్డను పరుండబెట్టి -


పాట:-

ఈబిడ్డ యించుక ఏడ్చిపోకండా - పాడండి పాటలు పక్షివరులారా!

ఊపండి వూయల వృక్షరాజములార - నీడనివ్వండి ఓ నీలమేఘములారా!

కన్నతల్లికి నేడు గట్టిపని వుంది - పెంచిన తల్లిపుడు పురమేగుతుంది"


అని పాడేసి వెళ్ళిపోయింది.మరికాసేపటికే అటుగా వెడుతూన్న రాజుగారు - నిర్జన ప్రదేశంలో నిశ్చలంగా నిద్రపోతూన్న ఆ చక్కనిపాపను చూచి ముచ్చటపడి, తన మేనాలో ఎక్కించుకుని వెళ్ళగా - ఆబిడ్డ సాగినదారులు, చేలన్నీ కంకుకుకుంచెడయ్యాయి. పాడుబడ్డ గ్రామాలు పట్టణాలయ్యాయి. అందుకందరూ ఆశ్చర్యపడి ఆపసికందుని ఎంతగానో పొగిడారు. ఆమె మహిమగల బాలికగా భావించారు.

రాజాపిల్లను రాణీకి వప్పగించగా - అంతవరకూ గొడ్రాలిగా వున్న రాణి గర్భవతియై కొడుకును కన్నది. రాజ్యం రెట్టింపు అయ్యింది. అంతటా కళాకాంతుల్ని కలిగించే ఆ బిడ్డకు 'రమాదేవి' అని పేరు పెట్టారు. ఆమె కాస్త ఎదగగానే - రాజుగారు ఆమెనే పెళ్లిచేసుకున్నాడు. అంతటితో రాణీకి రమాదేవి మీద అసూయా, ద్వేషం కలిగాయి.

ఒకనాడామె రమాదేవి నగలను అపహరించి, పెట్టెలో వుంచి తనమీద అనుమానం రాకుండా వుండేందుకుగాను, తననగలు కూడా అందులోనే వుంచి, ఆ పెట్టెను సముద్రంలో పారవేయించింది. ఆపెట్టెనొక చేపమ్రింగింది. ఆచేపను జాలరులు పట్టారు. ఆజాలరులు దానిని రాజుకు సమర్పించారు. ఆరాజు దానిని రాణీకి పంపి, రాత్రి భోజనంలోకి కూరగా వండించమన్నాడు. ఆరాణీ అందుకు కోపించి - "రాజుగారి రాసక్రీడలు ఆ రమాదేవి ఇంటిలోనూ కూరాకూళ్ళూ నాఇంటిలోనూనా? నేను వండను - తీసుకుపోయి ఆ రమాదేవికే ఇవ్వండి" అంది. ఆ నౌకరులు అలాగే చేయగా, ఆ రమాదేవి చేపను కోయగా, అందులో నగల పెట్టె దొరికింది. అన్ని నగలూ ధరించి - ఆరాత్రి మరింత అందంగా తయారయ్యి - మహారాజు మనస్సును ఇంకా ఆకట్టుకుంది.

ఈ సంగతి తెలిసిన రాణి ఎలాగైనా రమాదేవిని చంపదలచి, విషం కలిపిన పాయసాన్ని ఆమెకు పంపబోయింది. అంతలోనే రాణి ఇంటికి వచ్చిన రాజు - విషమని తెలియక, ఆ పాయసాన్ని త్రాగి అసువులు బాసాడు. రాణి, సహగమనానికి సిద్దపడి రమాదేవికి కబురు పంపింది. రమాదేవి కూడా సహగమనానికి సిద్ధురాలై - బయలుదేరుతూండగా ఒక ఒంటివృద్ధ బ్రాహ్మణుడెదురయ్యి - "ఎక్కడి కెళుతున్నావమ్మా" అని అడిగాడు. రమాదేవి జరిగినది చెప్పగా - ఆవిప్రుడు "సౌభాగ్యవతీ! అంత పని జరగకుండుగాక. నాకు కాళ్ళు కడుగుకునేందుకు నీళ్ళిచ్చి, నువ్వుకూడా కాళ్ళు కడుక్కో." అన్నాడు. ఆమె అట్లేచేసెను. అప్పుడా భూసురుడు "అమ్మాయీ! నాకు దాహమిచ్చి, నువ్వుకూడా దాహం పుచ్చుకో" మన్నాడు అందుకామె దుఃఖితయై - "ఓవేదమూర్తీ! మగనిశవం మొగసాలనుండగా - నేనిప్పుడు, దాహం పుచ్చుకోవడం ధర్మంకాదుగదా " అన్నది. అందుకా బ్రాహ్మణుడు - "సౌభాగ్యవతీభవ! అంతగతి పట్టకుండుగాక. నేను చెప్పినట్లు చేయి” అని చెప్పడం వలన, ఆమె ఆలాగే చేసింది. అప్పుడా పామరుడు "రమాదేవి! నాకు తలంటిపోసి, నువ్వు తలంటుకో. నాకు గంథమిచ్చి, నువ్వు పసుపు పూసుకో "అన్నాడు. అందుకామె భయపడుతూ - "తాళిగట్టినవాడి శవంతో కలిసి తగలబడి పోవలసినదాన్ని! నాకేమిటీశిక్ష? కాళ్ళు కడుక్కుని కాళ్ళుదాచుకున్నాను. దాహం పుచ్చుకుని గొంతు దాచుకున్నాను. ఇప్పుడు పసుపు పూసుకుని ముఖాన్నెలా దాచుకోగలను?” అనగా, ఆ బ్రాహ్మణుడు నవ్వి- "సౌభాగ్యవతీభవ! నీకేనష్టమూ కలగకుండా వుండుగాక. చెప్పినట్లు చేసి చూడవమ్మా!" అన్నాడు. ఆమె అలాగే చేసింది. అనంతరం అతని మాటపై అతనికి అన్నము పెట్టి, తాను తిన్నది. అతనికి తాంబూలమిచ్చి, తాను వేకున్నది. అప్పుడా బ్రాహ్మణుడు విష్ణువుగా మారి - "సాధ్వీ! నువ్వు నీతల్లి కడుపులో వుండగానే మాఘ ఆదివారపు నోము కథ విన్న కారణంగా నీ అయిదవతనానికి తరుగురాదు. ఈ అక్షతలు తీసుకు వెళ్ళి నీభర్త శవముపై చల్లు” అని, కాసిని అక్షతలిచ్చి, అదృశ్యమయ్యాడు. అంతట రమాదేవి ఆశ్చర్యపోతూనే - భర్తశవం వున్న స్థలానికి వెళ్ళి, ఆకళేబరం మీద విష్ణువిచ్చిన మాఘ ఆదివారపు నోము అక్షతలు చల్లగా, మరణించిన మహారాజు నిద్రలేచినట్టుగా లేచి కూర్చున్నాడు. అదిచూసి అందరూ ఆశ్చర్యపోయి "ఏనోము నోచావమ్మా! చనిపోయిన సౌభాగ్యాన్ని శాశ్వతంగా పొందా"వని అడగగా - "ఇది నోచిన ఫలంకాదు. లచ్చుమమ్మ అనే ఆవిడ-నేను మాయమ్మ కడుపులో వుండగా వినిపించిన మాఘ ఆదివారపు నోము కథను వినిన పుణ్యం మాత్రమే" అని చెప్పింది. "కథ వింటేనే ఇంత పుణ్యం వస్తే, నోము పడితే మరెంత ఫలితమో గదా" అని అంతా విడ్డూరపోయారు. రాజు-రమాదేవిచేతా, పెద్దరాణీచేతా కూడా ఆనోము పట్టించి తరుగులేని సంపదతో, తిరుగులేని సుఖసౌభాగ్యాలతో జీవించాడు.


విధానం :-

మాఘమాసంలో వచ్చే ప్రతీ ఆదివారము నాడూ విష్ణువును పూజించాలి. అది మొదలు ఒక సంవత్సరంపాటు పాలుత్రాగడం మానివేసి, సంవత్సరాంతాన అయిదుగురు ముత్తయిదులకు పరమాన్నంతో భోజనం పెట్టాలి. రెండవసంవత్సరం మజ్జిగను మానివేసి సంవత్సరాంతాన అయిదుగురు పేరంటాళ్ళకు పెరుగన్నం పెట్టాలి. మూడవయేట పప్పులు మాని, సంవత్సరాంతాన బూరెలతో భోజనం పెట్టాలి. నాలుగోయేట తలంటు కోకుండా వుండి, అయిదుగురు పుణ్యస్త్రీలకు తలంట్లు పొయ్యాలి. అయిదోయేట తాంబూలం మానివేసి, సంవత్సరాంతాన అయిదుగురు ముత్తయిదులకు తాంబూలాలివ్వాలి. ఆపైన ఉద్యాపనే.


ఉద్యాపన :-

తాంబూలాలివ్వడం అయ్యాక, అయిదుగురు పేరంటాళ్ళకు అయిదు క్రొత్త రవికెల గుడ్డలు, ఉగ్గు గిన్నె, ఉయ్యాలకు చీర ఇచ్చి ఒక సద్రాహ్మణుడిని శ్రీమన్నారాయణుడిగా భావించి, అయిదు మూరల అంగవస్త్రాన్ని దక్షిణ తాంబూలాలతో ఇవ్వాలి. నోము పట్టింది మొదలు, ఉద్యాపనమయ్యే వరకూ ప్రతీ మాఘపాదివారం రోజునా కథ చెప్పుకుని, ఎవరికైనా వినిపించి - అక్షతలు వేసుకోవాలి.





Top

BOTTOM