Type Anything.., You Get World Wide Search Results Here. !

మాతా వైష్ణోదేవి - జమ్ము కాశ్మీర్‌ / Mata Vaishno Devi - Jammu and Kashmir

మాతా వైష్ణోదేవి - జమ్ము కాశ్మీర్‌

పుణ్యప్రదమైన తీర్థయాత్రగా చెప్పబడే జమ్ము-కాశ్మీర్‌లో వెలసిన వైష్ణవీదేవి ఆలయం గురించి తెలుసుకుందాం...

ముగ్గురమ్మలు మూర్తీభవించిన దేవిగా, తనను దర్శించే భక్తులకు ధర్మార్ధ కామ మోక్షాలు ప్రసాదించే జగజ్జననిగా జమ్మూ-కాశ్మీరు రాష్ట్రంలో కొలువై ఉంది వైష్ణోదేవి. ఈ చల్లని తల్లి దర్శనార్ధం భక్తులు ఎక్కడెక్కడినుంచో సంవత్సరం పొడుగునా అశేష సంఖ్యలో వస్తారనేదే దేవి మహిమకి నిదర్శనం. ఆ దేవిని దర్శించినవరెవరూ తమ న్యాయమైన కోరికలు తీరకుండా రిక్త హస్తాలతో వెను తిరగరని భక్తుల ప్రగాఢ విశ్వాసం. 

సముద్రమట్టానికి 5200 అడుగుల ఎత్తులో త్రికూట పర్వత గుహలో వెలసిన వైష్ణో దేవి, భక్తులు అడిగే న్యాయమైన కోర్కెలు తీర్చే చల్లని తల్లి. ఈ ఆలయం ఎన్ని ఏళ్ళు క్రితందో ఆధారాలు లేవు. భూగర్భ శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ ఆలయం వున్న గుహ ఒక మిలియన్ సంవత్సరాల పూర్వంనుంచి వున్నదని కనుగొన్నారు. ప్రప్రధమంగా పాండవులకాలంలోనే శక్తి పూజలు ప్రారంభం అయినాయనీ, వారే ఈ ప్రాంతంలో దేవీ ఆలయాలు నిర్మించారని ఇంకొక కధనం. అందుకే ఉత్తరాదివారి కొంగు బంగారమై విలసిల్లే ఈ దేవి ప్రాశస్త్యం దక్షిణాదిలో అంత ఎక్కువగా కనబడదు. ఇక్కడివారు ఈ దేవిని లక్ష్మీ స్వరూపమని కొందరు, పార్వతీ స్వరూపమని కొందరు చెబుతారు. నిజానికి మహాలక్ష్మీ, మహాకాళీ, మహా సరస్వతి .. ఈ ముగ్గురి తేజోమయ స్వరూపమే ఈ తల్లి.

అమ్మవారి పేరు త్రిపుట. త్రిపుట కొండపై వెలసింది కనుక ఆమెకు ఆ పేరు వచ్చింది. పూర్వం జగన్మాత అసురుల బాధలు ఎక్కువగా వుండి వారితో పోరాడే సమయంలో భూలోకంలో ధర్మాన్ని రక్షించి, ప్రజలని కాపాడేందుకు మహాలక్ష్మీ, మహాకాళి, మహా సరస్వతులు తమ తేజస్సునుండి ఒక దివ్య శక్తిని ఆవిర్భవింప చేయాలనుకున్నారు. వారి సంకల్ప మాత్రంచేత అక్కడో అందమైన యువతి ప్రత్యక్షమైంది. వారు ఆ యువతిని భూలోకంలో ధర్మ సంరక్షణార్ధం రత్నాకరసాగర్ అనే ఆయనకి పుత్రికగా విష్ణు అంశతో జన్మించి ధర్మహిత కార్యాలు చేయమని, ఆధ్యాత్మికంగా ఉన్నత స్ధాయికి చేరుకున్న తర్వాత శ్రీ మహా విష్ణువులో ఐక్యం చెందుతావని చెబుతారు. ఆ మహాశక్తుల ఆదేశానుసారం రత్మాకరసాగర్ ఇంట జన్మించిన ఆ బాలికకు వైష్ణవి అని నామకరణంచేయబడ్డది.

స్థలపురాణం:
రత్మాకరసాగర్ ఇంట జన్మించిన ఆ బాలికకు చిన్నతనం నుంచి భక్తిభావం ఎక్కువ. ఎక్కువ భాగం ధ్యానంలో గడిపేది. ఓసారి తన తండ్రిని సముద్ర తీరానికి తీసుకువెళ్లమంది. అక్కడ ధ్యానం చేస్తుండగా శ్రీరాముడు తన భార్య సీతకోసం హనుమంత, సుగ్రీవ సైన్యంతో అక్కడకు వచ్చాడు. అప్పుడు ఈమె ధ్యానం గురించి తెలుసుకున్నాడు. ఆమెకు రాముని విషయం తెలిసింది. తనను వివాహమాడాల్సిందిగా కోరింది. అయితే అది సాధ్యపడదని రాముడు చెప్పాడట.

అయితే ఆ తర్వాత ఆమెకు ఓ అవకాశం ఇచ్చాడు. తిరిగి తను మళ్లీ వస్తాననీ, అలా వచ్చినప్పుడు తనను గుర్తుపడితే చేసుకుంటానని చెప్పాడట. అప్పటివరకూ ఉత్తరాదిలోని త్రిపుట కొండల్లో ధ్యానంలో ఉండమని శ్రీరామచంద్రులవారు సూచించారట. అలా కాత్రా వైపు ఉన్న కొండల్లో మాత ధ్యానం చేసుకుంది. ఆ తర్వాత శ్రీరాముడు ముని వేషధారణలో త్రిపుటను కలిశాడు. కానీ ఆమె గుర్తించలేదు. అందుకని భగవంతునిలో ఐక్యమయ్యే ఆవిడ కోరిక తీరలేదు.

బాధపడుతున్న వైష్ణవిని శ్రీరామచంద్రుడు ఓదార్చి, ఆమె తనలో ఐక్యమవటానికి తగిన సమయమింకారాలేదని, కలియుగంలో తాను కల్కి అవతారం ధరిస్తానని, అప్పుడు ఆమె కోరిక నెరవేరుతుందని ధైర్యం చెప్పాడు.  త్రికూట పర్వత సానువుల్లో ఆశ్రమం నెలకొల్పుకుని  తపస్సు కొనసాగిస్తూ, ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలు అవరోహించమని,  ప్రజల మనోభీష్టాలు నెరవేర్చి, పేద, బాధిత ప్రజల కష్టాలు తీర్చమని ఆదేశించాడు.

శ్రీరామచంద్రుని ఆజ్ఞానుసారం వైష్ణవి త్రికూట పర్వతసానువుల్లో ఆశ్రమాన్ని నెలకొల్పుకుని తన తపస్సు కొనసాగించింది.  అనతికాలంలోనే ఆవిడ శక్తిని గ్రహించిన ప్రజలు ఆవిడ ఆశీస్సులకోసం రాసాగారు.

కొంతకాలం తర్వాత గోరఖ్ నాధ్ అనే తాంత్రికుడు వైష్ణవి గురించి, ఆమె దీక్ష గురించి తెలుసుకుని, శ్రీరామచంద్రుడు ఆదేశించిన ప్రకారం ఆమె ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను అధిరోహించిందో లేదో తెలుసుకోవాలనే కుతూహలంతో, వివరాలు తెలుసుకురావటానికి  అత్యంత సమర్ధుడైన తన శిష్యుడు భైరవనాధుణ్ణి పంపాడు.  భైరవనాధుడు చాటుగా వైష్ణనిని గమనించాడు.  తపస్విని అయినా వైష్ణవి ఎల్లప్పుడు ధనుర్బాణాలు ధరించి వుండటం, ఆవిడకి రక్షగా లంగూర్లు, ఒక భయంకర సింహం వుండటం గమనించాడు. భైరవనాధుడు  వైష్ణవి అందానికి ముగ్ధుడై తనని వివాహం చేసుకోమని ఆమెని విసిగించసాగాడు. 

వైష్ణవికి అత్యంత భక్తుడైన శ్రీధర్ ఒకసారి ఊరందరికీ భోజనాలు పెట్టాలని అందరినీ ఆహ్వానిస్తూ, గోరఖ్ నాధ్‌ని, భైరవనాధ్ తో సహా మిగతా ఆయన శిష్యులనందరినీ భోజనానికి ఆహ్వానించాడు. భోజన సమయంలో భైరవుడు వైష్ణవిపట్ల అమర్యాదగా ప్రవర్తించాడు. వైష్ణవి మందలించినా వినడు. వివాదం పెద్దదిచేసి భైరవుణ్ణి శిక్షించటం ఇష్టంలేని వైష్ణవి వాయురూపంలో పర్వతాలలోకి వెళ్తుంది తన తపస్సును కొనసాగించ టానికి. భైరవుడు ఆమెని వదలకుండా వెంటాడుతాడు. బాణగంగ, చరణ పాదుక అని ప్రస్తుతం పిలువబడుతున్న ప్రదేశాల్లో ఆగుతూ ఈ పవిత్ర గుహ అర్ధకువారి (గర్భచూర్) దగ్గరకు వస్తుంది వైష్ణవి. ఈ గుహలోనే అమ్మవారు 9 నెలలు తపస్సు చేసింది. 9నెలల తర్వాత అమ్మవారి ఉనికిని భైరవుడు కనుక్కుని అక్కడకు వచ్చాడు. అయినా భైరవుడికి తన తప్పు దిద్దుకునే ఆఖరి అవకాశం ఇచ్చి, త్రిశూలంతో ఆ గుహ గోడను చీల్చుకుంటూ రెండవ వైపుకు వెళ్లిపోయింది. అమ్మవారి సన్నిధికి చేరిన భైరవుడు అన్ని హద్దులూ అతిక్రమించాడు. చివరికి అమ్మవారు విడువకుండా వెంటాడుతున్న భైరవుడి తలని ఆ గుహ బయట ఒక్క వేటుతో నరుకుతుంది. తెగిన భైరవుడి తల కొంచెం దూరంలో మరో పర్వత శిఖరం మీద పడింది.

అప్పుడు తన తప్పుతెలుసుకున్న భైరవుడు వైష్ణవీదేవిని క్షమించమని ప్రార్ధిస్తాడు. మాత దయతలచి, తన భక్తులంతా తన దర్శనం తర్వాత భైరవుణ్ణి దర్శిస్తారని, అప్పుడే వారి యాత్ర సంపూర్ణమవుతుందని వరమిస్తుంది.

తదనంతరం వైష్ణవి తన ధ్యేయం నెరవేర్చుకోవటానికి, అంటే అత్యున్నత తపస్సుతో శ్రీ మహావిష్ణువులో లీనమయ్యే అర్హత సంపాదించుకోవటానికి, అలాగే తనని సృష్టించిన త్రిమాతలు, మరియు శ్రీరామచంద్రుని ఆజ్ఞప్రకారం ప్రజల కోర్కెలు తీర్చటానికి త్రికూట పర్వతంపైన గుహలో 3 తలలతో 5.5 అడుగుల ఎత్తయిన రాతిరూపం ధరించింది. 
వైష్ణోదేవి గుహాలయంలో మనకి కనిపించే మూడు రాతి రూపాలు ('పిండీ' లంటారు అక్కడివారు) ఆ మాత తలలే. వాటినే మహాకాళీ, మహాలక్ష్మి, మహా సరస్వతిగా చెప్తారు అక్కడి పండితులు. ఆ రూపాన్ని ధ్యానిస్తే అనుకున్నవి నెరవేరతాయని విశ్వాసం. దర్శనం అనంతరం దేవాలయం వెనక్కి వెళితే ఆలయం వెనుక గంగాజలం పడుతుంటుంది. వాటిని శిరసుపై చల్లుకుని తాగితే కొండపైకి ఎక్కిన శ్రమంతా మాయమైపోతుందని నమ్మకం. ఆ తర్వాత అక్కడ అమ్మవారి ప్రసాదాలు తీసుకుని కిందికి దిగుతూ ఈశ్వరాలయాన్ని దర్శించుకోవాలి. దీంతో అమ్మవారి దర్శనం పూర్తవుతుంది.

పంచపాండవులు కట్టిన గుడి:

పాండవులు తమ అరణ్యవాసంలో బాల త్రిపుట గురించి తెలుసుకుని వచ్చారట. ఆమె ధ్యానం, భక్తికి, ధర్మానికి మెచ్చి అనంతరం దేవాలయాన్ని కట్టించారని ప్రతీతి. జమ్మూ నుంచి కాత్రాకు వెళుతుండగా నరోలి అనే గ్రామంలో ఆమె చిన్నతనంలో ధ్యానం చేసుకున్న ప్రాంతం గుడిగా మలిచారని అక్కడి గోడలపై రాతలు చెబుతాయి.
జమ్మూ - కాశ్మీర్ ప్రాంతంలో వెలసిన వైష్ణవిమాత దర్శనభాగ్యంకోసం భక్తులు ఎంతగానో ఎదురుచూస్తారు. దేశంలోనే తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి తర్వాత స్థానంగా చెప్పబడే వైష్ణవి మాత ఆశీస్సులు చాలా ఉత్తమం.

కాత్రా ప్రయాణం:
మాతను ముందుగా హంసలి గ్రామంలోని కోల్కండోలీలో దర్శనం చేసుకుంటాము. ఈ కోల్కండోలీలోనే అమ్మవారు తొలిసారిగా బాలిక రూపంలో శ్రీధరుడికి దర్శనం ఇచ్చింది. 

ఈ చోటనే నాలుగు దిశలా వైష్ణవీ మాత చిహ్నాలు కనిపిస్తాయి. ఒక చోట అమ్మ ఉయ్యాల ఊగిన దృశ్యం ఉంటే, ఇంకో చోట అమ్మవారు తన పాత్రలో బావి నీళ్ళు నింపుకునే దృశ్యం ఉంటుంది. ఈ స్థానంలోనే తన భక్తుడయిన శ్రీధరుణ్ణి సంతానం కోసం వైష్ణవ విందు ఏర్పాటు చేయవలసినదిగా అదేశించింది. అప్పుడు అమ్మవారే స్వయంగా బాలిక రూపం ధరించి అందరికీ వడ్డించింది. అప్పుడు అమ్మవారిని పరిక్షించగోరి భైరవనాధుడు మద్యం కావాలని అడిగాడట. అప్పుడు అమ్మవారు మద్య మాంసాలు ఇవ్వడం పాపం అని ఇవ్వడం కుదరదని చెప్పిందట. అయినా భైరవుడు వైష్ణవిపట్ల అమర్యాదగా ప్రవర్తించాడు. వైష్ణవి మందలించినా వినడు. వివాదం పెద్దదిచేసి భైరవుణ్ణి శిక్షించటం ఇష్టంలేని వైష్ణవి మాయం అయిపోయింది. 
అలా మాయం అయిన అమ్మవారు కొన్ని క్షణాలు నిలిచి దేవుడిని ప్రార్ధించారు. ఆ స్థలమునే మలి దర్శనంగా పేర్కొంటారు. అదే దేవమాత ఆలయం. ఇక్కడ మహా లక్ష్మి, మహా కాళి, మహా సరస్వతి లను దర్శించుకోవచ్చు. 



బాణ గంగ :
భైరవనాధుడుకి అమ్మవారి శక్తి తెలియదు. అందుకే అహంకారపూరితుడై అమ్మవారిని వెంబడించాడు. అప్పుడు అమ్మవారు ఒక బాలకుడితో పాటు భైరవనాధుడుకి అందకుండా పర్వతాల వైపు ప్రయాణం సాగించింది. దారిలో బాలకుడికి దాహం వేయగా అమ్మవారు తన బాణంతో నేలను చీల్చి గంగా నీటిని పుట్టించింది. ఈ ప్రదేశాన్ని బాణ గంగ అంటారు. 

చరణ పాదుక:
అక్కడి నుండి అమ్మవారు త్రికూట పర్వతానికి బయలుదేరిందట. మార్గ మధ్యంలో ఇక్కడే విశ్రమించిందట. ఆ ప్రదేశమే చరణ పాదుక అని అంటారు. నేటికీ ఇక్కడ అమ్మవారి పాదాలను మనం చూడవచ్చు. ఇక్కడ నుండే అమ్మవారు భైరవుడు తనని వెంటాడుతున్నాడా లేదా అని వెనుకకు తిరిగి చూసిందట. ఇక్కడి నుండి నేరుగా వైష్ణవీ మాత ఆలయం దిశగా ముందుకు సాగుతారు. 

గర్భచూర్:
భైరవుడు అజ్ఞానాన్ని మన్నించిన అమ్మవారు ఈ త్రికూట పర్వతం లోని ఒక గుహలో 9నెలలు ఈశ్వరుడిని ప్రార్ధించిందట. అక్కడికి కూడా భైరవుడు ఆమెను వెతుక్కుంటూ వచ్చేసాడట. అయినా భైరవుడికి తన తప్పు దిద్దుకునే ఆఖరి అవకాశం ఇచ్చిందట. ఆమె త్రిశూలంతో ఆ గుహ గోడను చీల్చుకుంటూ రెండవ వైపుకు వెళ్లిపోయిందట. ఈ గుహని గర్భచూర్ అని పిలుస్తారు. ఇక్కడి నుండి బయటకు రావడం అంటే తల్లి గర్భం నుండి బయటకు రావడం గానే చెప్తారు. ఇక్కడి నుండి వెలుపలికి రాగానే సకల పాపాలు నశిస్తాయట. చివరికి అమ్మవారి సన్నిధికి చేరిన భైరవుడు అన్ని హద్దులూ అతిక్రమించాడు. అందుకే అమ్మవారు భైరవుడిని వధించిందట.

Top

BOTTOM