Type Anything.., You Get World Wide Search Results Here. !

శరణు శరణు... అప్పయ్య శరణు - Sharanu Sharanu...Appaiah's Sharanu

 శరణు శరణు... అప్పయ్య శరణు.

ఎటుచూసినా శరణు ఘోష. ఊరూవాడా అయ్యప్ప భక్తులే దర్శనమిస్తున్నారు. పవిత్ర దీక్షతోస్వామీ అయ్యప్పకు ఆత్మనివేదన చేసుకుంటారు. కార్తీకమాసం వచ్చిందంటే చాలు, శరణమయ్యప్ప మము కావుమయ్యప్ప అంటూ భక్తకోటి శబరిమలై వైపు అడుగులు వేస్తుంటారు. శరీరాన్నీ. మనసును చెడు నుంచి మంచి మార్గంలోకి మళ్ళించే దీక్షే స్వామి శరణమయ్యప్ప మండల దీక్ష. అందుకు అనువైనదే కార్తీకమాసం. పరిమితకాలంలోనే  అయ్యప్ప దర్శనం జరుగుతుంటుంది. దీనికి కార్తీకమే ఆద్యం. మోక్షమార్గాన్ని అన్వేషించే వారూ,   సన్మార్గాన జీవనయాత్ర సాగించాలనుకునేవారూ తప్పనిసరిగా జీవితకాలంలో ఒక్కసారైనా శబరిమలై  యాత్ర చేయాలని ఉవ్విళ్లూరుతుంటారు.

 

కేరళలోని పంపానదికి చేరువన ఈ పవిత్ర కొండ (మలై) ఉంది. పశ్చిమకనుముల్లోని దట్టమైన అడవిప్రాంతంలో ఉన్న శబరిమలై భక్తుల ఆధ్యాత్మిక దాహం తీర్చే పుష్కరణి. పంపానది నుంచి ఆలయానికి చేరేలోపు భక్తులకు అనేక పరీక్షలు తప్పవు. ఎత్తైన కొండప్రాంతం, ఆపైన దట్టమైన అడవి...ఎంతటివారికైనాసరే, అయ్యప్ప దర్శనం సులువుగా లభ్యంకాదు. కొలిమిలో కాలితేనేకానీ లోహం మాట విననట్టే, ఈ దేహం కూడా భగవంతుడు పెట్టే పరీక్షలో కాలాల్సిందే. దానికి దగ్గర దారిలేదు. ఈ సత్యాన్ని చాటిచేప్పేది శబరిమలై యాత్ర. చలికాలం...మాట వినని స్థితిలో ఉన్న శరీరాన్ని లొంగదీసుకోవాలంటే, ఈ దేహచింతనను విడనాడి అలౌకికానందపుటంచులు చవిచూడాలంటే అందుకు మనము ముందు ఉన్న ఏకైక మార్గం స్వామి అయ్యప్ప మండలదీక్షే.


ఆద్యంతం భక్తి పారవశ్యమే :-


శబరిమలై యాత్ర ఆద్యంతం భక్తి పారవశ్యమే. లక్షలాది మంది భక్తులు ఎరుమేలి అనే స్థలికి చేరుకుంటారు. అక్కడ పేటతుల్లి ఆడివావరు స్వామి, పేటశాస్త్రీలను దర్శించుకుని ఆ తరువాత స్వామి సన్నిధానం చేరుతారు. పంపానది నుంచి బయలుదేరి ఇరుముడి మోసుకుంటూ కొండ అంచున ఉన్న అప్పాచిమేడుకు చేరుకుంటారు. అక్కడి నుంచి మరికొంత దూరం ప్రయాణం సాగిస్తే బహిరంగప్రదేశంలో శబరిపీఠం కనిపిస్తుంది. దీన్నే శ్రీరాముని కోసం శబరి నిరీక్షించిన ప్రదేశంగా చెబుతుంటారు. పంపానదికి. సన్నిధానానికీ మధ్య ఉన్న శరంగుత్తి ఆల్ కు భక్తులు చేరుకుంటారు. అక్కడ కన్నెస్వాములు శరంపుల్లాలను అక్కడ ఉంచుతారు. ఆ తరువాత సన్నిధానం చేరుకుని అయ్యప్పస్వామిణి దర్శించుకుంటారు.


అద్వైత మలై :-


అయ్యప్ప అవతారంలోనే ఒక విశిష్టత ఉంది. ఆయన హరిహర సుతుడు.శ్రీమన్నారాయణుడు మోహినీఅవతారంలో ఉండగా, శివ కేశవులకు జన్మించిన వాడే స్వామి అయ్యప్ప. అందుకే ఈ పుణ్యక్షేత్రంలో హరిహర బేధం లేదు. అద్వైతానికి నిలువెత్తు కొండ శబరిమలై.  కలియుగంలో ప్రత్యక్షదైవం తిరుమల వెంకటేశ్వరుని తరువాత అంతటి ప్రాచుర్యం పొందిన దైవం అయ్యప్పస్వామి. అయ్యప్ప దీక్షలోని కఠోర నియమాలు, చిత్తశుద్ధి, గురుభక్తి, ఆత్మనివేదన ఈ దీక్షలోని ప్రత్యేకతలు. 41 (మండల) రోజులపాటు ఈ దీక్ష కొనసాగుతుంది. పదునెట్టాండి (18 మెట్లు) ఎక్కి స్వామివారిని దర్శించుకోవడంతో దీక్ష ముగుస్తుంది. కఠోర దీక్ష ముగియగానే కలిగే మానసిక ఆనందం అంతా ఇంతా కాదు. మళ్ళీ ఎప్పుడు దీక్ష చేపడదామా, మళ్ళీ అయ్యప్పస్వామిని కనులారా చూస్తామా... అంటూ పరితపిస్తుంటారు భక్తకోటి. ఇనుమును సూదంటురాయి (అయిస్కాంతం) ఆకర్షించిన రీతిలోనే అయ్యప్ప తన భక్తులను ఆకర్షిస్తుంటాడు. ఈ ఏడాది నవంబర్ 16 నుంచి జనవరి మూడు వరకు మండల దర్శనం, అటుపై జనవరి పది నుంచి మకర సంక్రాంతి వరకు మకరజ్యోతి దర్శనంగా  పరిగణిస్తారు. 




   

Top

BOTTOM