Type Anything.., You Get World Wide Search Results Here. !

అమావాస్య - Amavasya

అమావాస్య

జ్యోతిషశాస్త్ర ప్రకారంగా సూర్యునిలో చంద్రుడు కలిసిపోతాడు కాబట్టి ఆ రోజు రాత్రి చీకటిగా ఏర్పడుతుంది. అమావాస్య అంటే ఆధ్యాత్మిక తత్వంలో ఎంతో గొప్పది. హిందూ పురాణాల ప్రకారం ఆకాశంలో చంద్రుడు కనబడని రోజుని అమావాస్య అని కొంత మంది నమ్ముతారు. అంతేకాదు ఆ రోజున ఎలాంటి పనులు చేపట్టినా విజయవంతం కావు అనేది కొంత మంది విశ్వాసం. అమావాస్య పూజ చేయాల్సిందేనా? పితృదేవతలకు శ్రాద్ధం ఇవ్వాల్సిందేనా? అని కొంత మందికి సందేహాలు కలుగుతాయి. అమావాస్య పూజ చేయడం వలన శుభ ఫలితాలను ఇస్తుంది. జీవితంలో సుఖ సంతోషాలను ప్రసాదిస్తుంది.

సృష్టికి పూర్వం స్వయంభు: గా వెలసిన వేదపిత ,సృష్టికర్త శ్రీమద్ విరాట్ విశ్వకర్మ భగవానుని వంశజులైన విశ్వబ్రాహ్మణులు/ వైశ్వకర్మణియులు నియమనిష్టాగరిష్టులు ఈ అమావాస్య రోజును ఎంతో పవిత్రంగా భావిస్తారు. వారి కులదైవాలైన విశ్వకర్మ భగవానుని, వేదమాత గాయత్రి అమ్మవారిని, బ్రహ్మం గారిని నిష్టగా పూజించి ఆ రోజున పరిపూర్ణమైన ఆధ్యాత్మిక చింతనతో ఉంటారు. సృష్టికి ప్రతిసృష్టిని సృష్టించే కులవృత్తి పనిముట్లను శుభ్రపరచుకుని వాటిని పూజించి అమావాస్య రోజు కులవృత్తులకు సెలవు ప్రకటించుకుంటారు.

సాధారణంగా విశ్వబ్రాహ్మణేతరులు అమావాస్య రోజున శనిదేవుడిని కూడా పూజిస్తారు. తిలలు, నూనెతో అభిషేకం చేస్తారు. పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం వల్ల గత జన్మలో పాపాలు తొలగిపోతాయి అని భావించి ధాన ధర్మాలు చేసే వారు చేస్తారు. పితృదేవతలు మన శ్రేయస్సును కోరుకుంటారు కాబట్టి అమావాస్య రోజున వారికి పిండ ప్రధాన పూజ చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది. జీవితంలో సుఖ సంతోషాలను ప్రసాదిస్తుంది. ఇంట్లో పూజగదిని శుభ్రం చేసుకుని పితృదేవతలకు భోజనాన్ని నైవేధ్యంగా సమర్పించాలి, ఈ అన్నాన్ని కాకులకు పెట్టాలి, ఇలా చేయడం ద్వారా అమావాస్య రోజున కాకుల రూపంలో పితృదేవతలు మనం సమర్పించిన ఆహారాన్ని తీసుకుంటారని విశ్వాసంగా పెద్దలు చెబుతారు.

ప్రతి అమావాస్యకు పితృదేవతలకు పిండాలు పెడితే వారు సంతోషిస్తారు. సాధారణంగా పితృదేవతలు ఏడుగణాలుగా వుంటారని, తొలి మూడు గణాల దేవతలు అమూర్తులుగా.. అంటే ఆకారం లేని వారుగా ఉంటారని శాస్త్రాల ద్వార తెలుస్తున్నాయి. మిగిలిన నాలుగు గణాలైన వారికి మాత్రం ఆకారాలుంటాయి. పితృగణాలు దేవుళ్లతో కలిసి శ్రాద్ధాన్ని భుజిస్తాయని, భోజనంతో సంతృప్తి చెంది శ్రాద్ధదాతకు సుఖ, సంతోషాలను ప్రసాదిస్తాయని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి.

పితృదేవతలను సంతృప్తి చెందితే ... ఆ కుంటుంబంలో తప్పకుండా అష్టైశ్వర్యాలు కలిగి ఈతిబాధలు తొలగి పోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే అమావాస్య రోజున మధ్యాహ్నం 12 గంటలలోపు పితృదేవతలను పూజించి వారి శ్రాద్ధం ఇవ్వాలి. పెద్దలను స్మరించుకుని ఆవులు, కాకులకు, కుక్కలకు ఆహారం పెట్టడం వలన పరమ పవిత్రం అవుతుంది.

శాస్త్ర ప్రకారం ఈ సమయంలో పూర్వీకుల శాంతి కోసం శ్రద్ధతో ఏవైనా ఆచారపరమైన పనులు చేయడం వల్ల ప్రయోజనం చేకూరుతుందని చాలా మంది నమ్మకం. ఆ రోజున ఉపవాసం ఉంటే మన పూర్వీకుల బాధలను తీర్చడమే గాక, రాహు బలహీనత మరియు వంధ్యత్వం నుండి ఉపశమనం పొందడంలో కూడా సహాయపడుతుంది. పితృ ఋణం పెంచుకోవడం శ్రేయస్కరం కాదు. వీటి వలన అనేక సమస్యలు ఉత్పన్నమౌతాయి. కుటుంబ సమస్యలు, ఆలస్య వివాహాలు, సంతానం కలగక పోవడం, వ్యవహార సమస్యలు మొదలైన అనేక ఆటుపోట్లతో జీవితం సాగుతుంది.పెద్దలను మరువకండి వారి ఆశీస్సులే శ్రీరామ రక్ష.




Top

BOTTOM