అజ్ఞానం ౹ జ్ఞానం ౹ విజ్ఞానము ౹ సుజ్ఞానము
అజ్ఞానం అంటే ఏమిటి ?
తానెవరో తనకు తెలియకపోవడమే అజ్ఞానం
జ్ఞానం అంటే ఏమిటి ?
తానెవరో తనకు తెలియడమే జ్ఞానం .
ఆత్మ జ్ఞానం వలెనే మోక్షం కలుగుతుంది తప్ప అన్యధా అస్సాదం.
జ్ఞానం వినా మోక్షం న సిద్ధ్యతే "
శోకత్తరతి ఆత్మవిట్ "
నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే "
అంతేకాని తనకు వేద శాస్త్రాలు పురాణం ఇతిహాసాలు తెలిసినా , తెలియకపోయిన జ్ఞాన అజ్ఞానం కాదు.
తానెవరని విచారణ చేయగా దేహేంద్రియప్రణమనోబుద్ధుల కాదని తెలుస్తుంది.
తానే సర్వమును తెలుసుకుంటున్న తెలివి.
సూర్యుడు ఉదయించినప్పటి నుండి సూర్యాస్తమయం దాకా ఆ తెలివి వస్తూ ఉంటూ పోతుంది.
కొందరు వాయించలేక మద్దెల దరువేయమనట్టు , తెలివి యొక్క రాక పోకలు తెలియకుండానే ( ప్రజ్ఞానం బ్రహ్మమని ) నమ్ముతున్నారు.
ఈ తెలివి కర్మేంద్రియాలతో కలిసినపుడు స్వల్ప గుణం ఉప్పత్తి అవుతుంది.
ఇదే కేవలం ఈ తెలివి జ్ఞానేంద్రియాలతో కలిసినపుడు
ఎరుక.
చిన్న చెంబులో నీళ్లు , బిందెలో నీళ్లు, రెంటిలో నీళ్ళే ఉన్నాయి.
ఉపాధుల్లో మాత్రమే తేడా ఉంది.
అన్నమయ , ప్రాణమయ , మనోమయాల్లో సంచరించే తెలివికి , వాటిని దాటిపోయినా విజ్ఞానమయ కోశంలోని తెలివి విశేషమైనది.
ఆ విశేషమైన తెలివిగలది తురీయమ్
తురీయానికి , విశేష తెలివికి ఎరుక అని చెప్పవచ్చు.
తక్కువ తెలివిని బుద్ధి అంటారు.
అయితే ఆ తెలివిని తెలుసుకున్న , తెలుసుకోకపోయిన తెలివిగదా ?
తెలిసిన , తెలియకపోయిన తెలివి యొక్క విరహవ్యదా మోహము , భయము , జననమరణాలు , సుఖదుఃఖాలు పోవు.
ఎలాగంటే వేపాకు చేదని తెలిసిన చేదే , తెలియకపోయిన చేదే
ఆ వేపాకు ఉన్నంత వరకు దాని చేదు గుణం పోదు.
ఆ వేపాకును కాల్చివేస్తే దానితోపాటు చేదు కూడా పోతుంది.
అలాగే తానే తెలివని తెలిసిన , తెలియకపోయిన విరహవ్యదా మోహము మొదలైనవి పోవు.
సద్గురువుని కృపచే ఆ తెలివిని దగ్ధం చేయాలి.
ఆ తెలివి ఉండుట వలెనే కదా మరణ భయము కలుగుతున్నది.
తెలివికి తెలివే మృత్యువుగా ఉన్నది.
ఏంటంటే స్వజాతి వైరము ?
కుక్కకు కుక్క వైరోధము ,
యాచకునికి యాచకుడు వైరోదియగును .
అందుకే "మృత్యోస్స మృత్యుమాప్నోతి
#అజ్ఞానం :
నన్ను నేను తెలియక విషయాదులయందు వర్తించుట, శరీరమును సుఖపెడితే వచ్చే ఆనందము సత్యమని, ఇంద్రియాలు, మనసు వీటివల్ల కలిగే సుఖదుఃఖ అనుభవాలే సత్యమని, ఇవి లేకపోతే నేను లేను అనుకొనుటే అజ్ఞానము.
#జ్ఞానము :
నేను దేహమును తెలుసుకొను వాడను కాని నేను దేహమును కాను. నేను ఆత్మ స్వరూపుడను, నేను మనసును తెలుసుకొనువాడను కాని మనసు యొక్క అనుభవములు నావి కావు. నేను మనసును కాను. నేను ఆత్మస్వరూపుడను. నేను ప్రకాశరూపుడను. ప్రజ్ఞా స్వరూపుడను. ఈ ప్రజ్ఞయే పిపిలికాది బ్రహ్మపర్యంతము 'నేను' గా ప్రకాశింప బడుతున్నదని తెలుసుకొనటయే జ్ఞానము.
#విజ్ఞానము :
ఇట్లు తెలిసిన జ్ఞానమును తనకు అన్వయించుకొని, తన స్వరూపమే జ్ఞానమని, తక్కినదంతయు అన్యముగా నిరశించి, జ్ఞానమే తానైన స్థితి విజ్ఞానము.
#సుజ్ఞానము :
పైన చెప్పిన అనుభవములకు కారణము ఎఱుక అనియు. ( ఎఱుకన్నా, జ్ఞానమన్నా ఒక్కటే ).
ఈ ఎఱుకే జీవుడి అజ్ఞానమును, ఈశ్వరుడిగా జ్ఞానస్థితినీ, పరబ్రహ్మగా మౌనస్థితిని పొందుతున్నదనియూ, కాలప్రభావమున మరలా ఎఱుక సంకల్పించి, జీవేశ్వర జగత్తుగా మారవచ్చుననియూ,
త్రిగుణముల యొక్క సామ్యావస్థే పరబ్రహ్మమనియు, త్రిగుణముల యొక్క వ్యవహారమే సృష్టి అనియూ,
ఇది కాలచక్రముగా అనేక బ్రహ్మాండములను పరిపోషించుచున్నదనియూ ఎరిగి, త్రిగుణములను నిరశించి, ఎరిగే ఎఱుకను వీడి, ఎఱుకను నిరశించి బయలగుటే సుజ్ఞానము.
వాసనా బలం అంటే శరీర వాసన ( దేహ వాసన ), శాస్త్ర వాసన, లోక వాసన. ఏం చేసిన మన జీవితమంతా, ఈ మూడింటి కోసమే.
పెళ్ళి చేసుకున్నావండి, దేని కోసం? దేహ వాసన, శాస్త్ర వాసన, లోక వాసన కోసం.
మూడు కనపడుతన్నాయి కదా.
శరీరానికి సుఖం కావాలంటావా? #దేహవాసన.
కాదండి లోకం కోసం, సృష్టి పునరుత్పత్తి కార్యంలో భాగంగా అంటావా - #లోకవాసన.
కాదండి, శాస్త్రార్థం మేరకు ఐదురోజు పెళ్ళి చేశానండి అంటావా - #శాస్త్రవాసన.
కాబట్టి ప్రతిపనిలో కూడా ఈ మూడు వాసనలు వున్నాయి. లేనిది ఏదో చూపెట్టండి? ఇదే #వాసనాత్రయం అంటే.
నిద్రపోయే పనిని తీసుకోండి.
నిద్రపోయే పనిలో ఏమున్నాయి?
వుందా లేదా దేహవాసన?
ఎందుకని నిద్రపోకపోతే దేహం పనిచేయదుగా.
విశ్రాంతి లేకపోతే దేహం పనిచేయదు నాయనా! అనే భావం చేత నిద్ర లోపలికి పోయామనుకొండి అది దేహవాసన అయ్యింది.
నేను ఆత్మస్వరూపుడిని అని గమనిస్తూ, నిద్రను కూడా నేను గమనించేవాడను, నిద్ర ఇంద్రియాలకే కాని, నాకు కాదు.
నేను ఆత్మ స్వరూపుడను.
అవస్థాత్రయానికి సాక్షిని అనే పద్ధతిలో నిద్రలోకి వెళితే, అప్పుడు నిద్రకూడా జ్ఞానమే అయ్యింది.
అదే పద్ధతిలో మరణంలో కూడా ఉండగలుగుతాము.
మరణం ఇంద్రియాలకె, నాకు కాదు కదా.
నేను సాక్షిని కదా!
మరణానికి కూడా సాక్షిని.
పుట్టుకలో సాక్షిగా వున్నవాడిని, మరణంలో సాక్షిని కాదా!
ఎందుకని అంటే నేనే లేకపోతే శరీరం ఎట్లా ఏర్పడింది తల్లి గర్భంలో?
ముందు ఏది ఏర్పడింది తల్లి గర్భంలో?
ముందు నేను వున్నాను.
జీవుడనే నేను వుండబట్టి, నాకు ఆధారం ఆశ్రయం కావలసినదాన్ని నేనే ఆ సాలె పురుగు వలె, ఈ శరీరమనే ఇల్లును అట్లా అల్లాను.
సాలె పురుగు అల్లడంలేదా?
అల్లుతోంది గూడుని.
అట్లాగే నేను నాకు కావలసిన జీవితం, భవిష్యత్తులో నా అనుభవానికి ఎలాంటి ఇంద్రియాలు కావాలో, అటువంటి ఇంద్రియాలను తల్లి గర్భంలో అల్లుకున్నాను.
సాలెపురుగు తనలో నుంచే దారాన్ని తీసి తన గూడును అల్లుకుని, అందులోనే వుండి, ఆహారాన్ని అందులోనే సంపాదించుకొని అక్కడే చనిపోతుంది.
జీవుడు కూడా అంతేకదా.
తల్లి గర్భంలో వున్నటువంటి జీవపదార్థాన్ని వుపయోగించుకుని, తనలో వున్నటువంటి శక్తిని ఉపయోగించి, తన ఇంద్రియాలను నిర్మించుకుంటాడు.
నిర్మించిన ఇంద్రియాలలోనే జీవుడు అలాగే ఉండి, అక్కడే ఆహారాన్ని సంపాదించుకుని అక్కడే ఆనందాన్ని సంపాదించుకుని, అదే సత్యమనుకుని అక్కడే చనిపోతున్నాడు.
ఇప్పుడు మానవుడు తన శరీరమే సత్యమంటే, సాలెపురుగువలె జీవిస్తున్నాడని అర్ధం.
అదే గూటిలో చిక్కుకుని జీవిస్తున్నాడని అర్ధం.
ఎవ్వరూ మనకు జైలు సృజించలేదు.
ఎవ్వరూ మనకు బంధాలు సృజించలేదు.
ఎవ్వరూ మనకు కష్టాలు కలిగించడంలేదు.
ఎవ్వరూ మనకు దుఃఖాలు కలిగించడంలేదు.
మన జీవితం అంతా ఇతరులను నిందించినది అంతా వట్టి వృధా.
ఇతరులు ఎవరూ మన దుఃఖాలకు కారణం కానే కాదు.
ఎందుకని అంటే మనం ఈ సాలె పురుగు వలె జీవిస్తున్నాము.
తల్లి గర్భం నుంచి మరణం వరకూ కూడా మన జీవితం సమస్తం అదే సాలెపురుగు వలె వాసనాబలంతో జీవిస్తున్నాము.
ఆ సాలెపురుగు దేహ వాసనాబలం ఇంకా మనల్ని విడిచిపెట్టలేదు.
ఎక్కడ క్రిమి కీటకాదులలో వున్నటువంటి సాలె పురుగు?
ఎక్కడ మానవుడు?
84 లక్షల జీవరాశులలో అంతకంటే ఉత్తమమైనటు వంటి జన్మలు ఎన్నో అనుభవించి, ఆ నాటి క్రిమి కీటక దశను ఇంకా వదులుకోలేకపోతిమే.
మరి మానవుడిగా పుట్టి ఏం ప్రయోజనము?
ఇంత ఉత్తమమైన ఉపాధి కలిగి ఏమీ ప్రయోజనము లేదు కదా !
తల్లి గర్భంలో ఇంద్రియాలు ఎట్లా ఏర్పడుతున్నాయి అనేటటువంటి జ్ఞానమే మనకు లేదు.
ఆ ఇంద్రియాలు ఎట్లా ఏర్పడుతున్నాయి?
ఆ సాలెపురుగు ఎట్లా అయితే నిర్మిస్తుందో అట్లా ఏర్పడుతున్నాయి.
అందులోనే తన ఆనందాన్ని వెతుక్కున్నది.
అందులోనే తన ఆహారాన్ని సంపాదించింది.
నువ్వు కూడా అలాగే చేస్తున్నావయ్యా!
కాబట్టి నీ ఆనందమంతా బయట నుంచి రావడం లేదు.
నీ యందే వున్నది.
ఆ ఆనందం ప్రతిబింబిస్తున్నది.
ఈ పూట మజ్జిగ పులుసులో ప్రతిబింబిస్తే, రేపు ఉలవచారులో ప్రతిబింబిస్తుంది.
అంతకు మించి ఏముంది తేడా?
నీ యందు ఆ ఆనందమనే స్థితే లేకపోయినట్లయితే నీకా ఆనంద అనుభవం కలగదు కదా?
కాబట్టి ఆ క్రిమి కీటక జంతువు అవస్థ నుంచి, నువ్వు పరిణామం చెందాలి.
ఈ ఉత్తమమైనటువంటి మానవ ఉపాధిని ఇవ్వడమే పరమాత్మ చేసేటటువంటి మొదటి, ఆఖరి సహాయం.
ఇంతకు మించి ప్రత్యేకంగా నీ లలితా సహస్రనామాలకో, విష్ణు సహస్రనామాలకో, నీస్తుతిలకో, స్తోత్రాలకో ఆయనేదో పొంగిపోయి ఇచ్చేటటువంటింది ఏమీ లేదు.
ఆయన ఒకటే సారి మానవ ఉపాధిని మనకు ఇచ్చేశాడు.
మనసా మాయన పడకే ,
తస్మాత్ జాగ్రత్త
అరిషడ్వార్గాలనే దొంగలు ఆరుగురు చొరబడతారు,
జ్ఞానమనే రత్నాన్ని దోచుకుపోతారు.
మరువకు మీ శ్రీహరి గురుపాద, మంత్ర స్మరణ.
ఈ ఉత్తమమైనటు వంటి మానవ జన్మను సద్వినియోగ పరచుకోవడమే మన కర్తవ్యం.
కానీ ఇది తెలియక, బాల్యంలో ఎట్లా అయితే కామ్యక కర్మలు, కోరిక కొరకే చేయడం అనేటటువంటి అజ్ఞానావస్థలో ఉన్నామో, జీవితకాలం అక్కడే ఆగిపోయాము.
అలా ఆగిపోకూడదు కదా.
ఒక్కొక్కటి జీవనదశలలో ఎట్లా అయితే, చూస్తూ, ఆ జ్ఞానాన్ని పొందుతూ, అధిగమిస్తూ, బాల్యం నుంచి పరిణామం చెందుతూ వచ్చామో, అట్లా పరిణామం చెందాలి కదా.
అన్నింటినీ వదులుకోవాలి కదా, వదులుకోకుండా ఎందుకువున్నాము?
ఆ వదులుకోలేక పోవడం అనేటటువంటి, నిగ్రహం మనకు లేదన్నమాట.
అందుకని సాధన చతుష్టయం అనే నాలుగు సంపదలు వుండాలట.
ఈ జ్ఞానాన్ని పొందాలి అంటే, మనకు సాధన చతుష్టయ సంపత్తి వుండాలి.
సాధనాచతుష్టయ సంపత్తి సంపాదించిన తరువాతే వేదాంతం బోధించమన్నారండి.
కానీ ఎందుకు ముందు చెప్తున్నామంటే, దీని ఔన్నత్యం మనకు తెలియదు కదా!
నేరుగా సాధన చతుష్టయ సంపత్తి చెప్పామే అనుకోండి, ఎందుకయ్యా నాకిది?
ఏం చేసుకోను? అంటారు కదా అందుకని,
నువ్వు ఎందుకని సాధనాచతుష్టయ సంపత్తి సంపాదించాలో ముందు ఆత్మ విచారణ చెప్పాలి.
చెబితే మనకు తెలుస్తుంది.
ఓహో! జీవితంలో ఇప్పటి వరకూ ఏం కోల్పోయాను నేను?
ఇప్పటి వరకూ సంపాదించింది ఏమైనా నావేనా అవి?
అవేవీ నావి కాదు.
మరి నీవైనవి ఎవయ్యా?
నీవంటు కొన్ని సంపాదనలు సంపాదించుకోవచ్చు, అవి సాధన చతుష్టయ సంపత్తి.
ఆ నాలుగు సాధనాలు, నీ దగ్గర కనుక వుంటే, వాటితో జ్ఞానాన్ని సంపాదించవచ్చు.
ఈ జ్ఞానం మరణంలో కూడా పోకుండా నిలబడుతుంది.
ఎలా అంటే ఇంతకు ముందు జన్మాంతరంలో అనేక జీవులలో జంతు శరీరాలలో నువ్వు పరిణామం చెందుతూ, మార్పు చెందుతూ వచ్చావు కదా.
అట్టి పరిణామం చెందినటు వంటి జంతు జ్ఞానం వుందా పోయిందా? వుంది కదా.
వుంటేనే కదా నువ్వు మానవుడిగా ఇన్ని చేయగలిగావు?
లేకపోతే నిన్ను బోర్లా వేసింది ఎవరు?
నిలబడేటట్టు చేసింది ఎవరు?
మాట్లాడేటట్టు చేసింది ఎవరు?
అవన్నీ ఎవరు నేర్పారు?
ఎవరూ నేర్పే అవకాశం లేదు, నీలో సహజంగా పూర్వ జన్మాంతరం నుంచి ప్రాప్తించిన జ్ఞానం అది.
కాబట్టి జ్ఞానం శరీరం పోయినా నిలబడుతుందని మనకు అర్ధం అవుతుంది.
మనసా మాయన పడకే , తస్మాత్ జాగ్రత్త
విషయ చింతనే విషము/ బంధము, గురుదైవ చింతనే అమృతము.
దేహేంద్రియ మనోబుద్ధులతో తాదాత్మ్యతే దుఃఖము , ఆత్మగా ఉండుటే ఆనందము. మనో శోకమే నరకము ,
మనో శాంతమే స్వర్గము .
స్వామి వివేకానంద ఇలా సెలవిచ్చారు ....
ఆధ్యాత్మిక జన్మను ఇచ్చేవారే మనకు యథార్థమైన గురువు .
వారి ద్వారానే ఆధ్యాత్మిక శక్తి మనలోకి ప్రవహిస్తోంది ;
వారే ఆధ్యాత్మిక ప్రపంచమంతటితోను మనకు సంబంధాన్ని కలిపే రామసేతు వంటివారు .
ఫలానా వ్యక్తిని మితిమీరి విశ్వసించటం మనో దౌర్బల్యానికీ , మూర్తి ఆరాధనకూ కారణం అవుతుంటుంది .
కాని గురువుపట్ల మనకు ఉండే గాఢ భక్తితోనే శీఘ్రవికాసం సాధ్యమవుతుంది ;
బాహ్య గురువు మనలను ఆంతర గురువుతో కలుపుతాడు .
నీ గురువులో పరమార్థతత్వం ఉంటే , వారిని ఆరాధించు .
ఎందుకంటే గురుభక్తి త్వరితంగా నిన్ను పరతత్త్వానికి చేరుస్తుంది .
శ్రీరామకృష్ణులు పరిశుద్ధ ఆత్మస్వరూపులు .
వారు తమ జీవితంలో ధనాన్ని అంటుకోలేదు ;
కామం వారిలో నిర్మూలింపబడింది .
శ్రీరామకృష్ణులలో మానవత్వం అంతరించి దైవత్వం మాత్రం మిగిలింది ;
వారి కంటికి పాపం అగపడదు ,
దోషాన్ని చూడలేనంతటి విశుద్దాత్ముడు ఆ మహనీయుడు .
ఈ కొద్దిమంది పరమహంసల పవిత్రత లోకాన్ని నిలబెడుతోంది ;
వారంతా గతిస్తే ప్రపంచం విచ్ఛిన్నమైపోతుంది .
తమ ఉనికిలోనే వారు లోక కళ్యాణం ఒనగూరుస్తూంటారు ;
కాని అలా జరుగుతున్నట్లు వారికది తెలియదు .
గురుదైవ ధ్యానములో పరవశమే, నామనసు శబ్దస్పర్శరూపరసగంధాలనే సంసార విషయ చింతనలో పర 'వశమే' .
ఎన్నో జన్మల నుండి మనసుకి బహిర్ముఖమవడం,.
విషయసుఖాలను పదేపదే అనుభవించడం బాగా అలవాటైపోయింది .
అంతర్ముఖమై ఆత్మానుసంధానమై ఆత్మానందాన్ని పొందాలనుకోదు ఎందుకంటే దానికి విషయసుఖాలే శాశ్వతమనుకుంటుంది.
అవి శాశ్వతం కాదని,
బుద్ధి ఎంత చెప్పిన వినదు.
వాసనాబలంచేత లాగబడుతుంది .
మతికి మనసుకి పొంతన కుదరక మనిషి నలిగి చస్తున్నాడు .
సుఖమొస్తే పొంగిపోతుంది,
దుఃఖమొస్తే కుంగిపోతుంది.
భ్రమయని తెలిసినా, బతుకు బొమ్మలాటయని తెలిసినా , కథయని తెలిసినా, కథలన్నీ కంచికే చేరునని తెలిసినా, వేదాంతం తెలిసినా. అన్ని తెలిసి అడుసులో పడి దొర్లుతుంటాము ఎందుకని ఒకటి మాయ , రెండవది ప్రారబ్దము.
ఎంతటి వారైనా ఈ రెంటిని దాటుట బహు దుర్లభము.
ఈ విశ్వంతో పోల్చిచూస్తే విషయాలకు వస్తువులకు ఏమీ విలువ లేదు కదా?
ఆ విశ్వానికి సంబంధించిన జ్ఞానాన్ని పొందడానికి, పరమాత్మకు సంబంధించిన జ్ఞానాన్ని పొందడానికి అర్హత వున్నటువంటి మానవఉపాధి మనకు లభించింది, పనిముట్లు లభించాయి.
కానీ ఆ పనిముట్లతోటి మనం ఏం చేస్తున్నాము?
కంట్లో ఆపరేషన్ చేయడానికి సాధ్యమైన సునిశితత్వం వున్నటు వంటి పనిముట్టుతో, బీరకాయలు తరుగుతుంటిమి.
ఏమిటయ్యా అని అంటే, నాకు ఇదే వచ్చు అంటుంటిమి.
ఇంతకన్నా అజ్ఞానం ఏమైనా వుందా?
ఇప్పుడు దేనికోసం బాధపడుతావు? దేని కోసం దుఃఖిస్తున్నావు?
అర్థం వుందా ఏమైనా నీ దుఃఖానికి. ఒకసారి ఆలోచించు?
దుఃఖం కలిగినప్పుడల్లా ఈ మాటలు గుర్తుకు రావాలండి.
అయ్యో! నా జీవితం వృధా అయిపోంది. దుఃఖం కలుగగానే ఈ మాటలు మనకు స్ఫురించాలండి.
దుఃఖం కలిగిందంటే అజ్ఞానం వుంది, అహంకారం వున్నది అని అర్ధం.
ఇలాగె మన సమయం అంతా వృధా అయిపోతోంది.
ఇంతకాలం ఎన్నో సంవత్సరాల పాటు, ఈ నలభై ఏళ్ళు, యాభై ఏళ్ళపాటు జీవితం అంతా ఇలాగే కదా పోయింది.
ఈ వెల లేనటువంటి అంశాల కోసం, ఎందుకూ కొరగాని అంశాల కోసం, దుఃఖించితినే.
ఒక మనిషి బాధ పెడుతన్నాడు, అతని చేత నేను బాధించబడుతున్నాను అనేదే కదా మన బాధ.
అతను ఎక్కడున్నాడు?
నేను ఆత్మస్వరూపుడను.
అంటే నేను అంతటా, సర్వత్రా వ్యాపించి వున్నవాడను.
అతనిలో వున్న అంతరాత్మ ఎవరు?
నేనే.
పరమాత్మ ఎవరు?
నేనే.
అతనికి నాకు ఏం తేడా వుంది?
శరీరం తేడా వుంది.
అంతే కదా! ప్రాణ మనో బుద్ధులు అతనిలో నాలో ఒకటేగా. ఏం తేడా వచ్చింది?
గిన్నె తేడా అంతే కదా.
అంతకు మించి ఏమీ లేదు.
ఈ గిన్నె ఆ గిన్నెను ఎలా బాధించింది?
ఉదాహరణ :
మీ ఇంట్లో బోల్డు గిన్నెలు వున్నాయండి.
ఈ గిన్నె ఆ గిన్నెను బాధించగలిగిందా?
అలా అనుకున్నా మనసు ఊరుకోవడం లేదు కదా మరి, అంటే అర్థమేమిటి?
ఏదో ఒక వాసనకు మనసు లొంగింది.
ఎవరన్నా వచ్చి ఏమన్నా అన్నారనుకోండి,
ఆ మాటకు ఈ మనసు నన్ను కాదులే అనుకోవడం లేదు,
స్పందిస్తోంది అక్కడ.
ఎలా స్పందిస్తోందంటే,
దేహవాసనకు లోబడి స్పందిస్తోంది.
యోగి జీవనమే దివ్యజీవనము.
ఆలోచనల , ఊహల , కోరికల
సముదాయమే మనస్సు.
" మనఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః "
బంధానికి మోక్షానికి కారణం
మనసే అని బోధపడింది .
ఇప్పుడు బోధ తెలిసింది అది
ప్రబోధ అవాలి .
నిత్య తృప్తి అనుభవంలోకి రావాలి .
భోగ జీవనమే అనుభవంలో ఉంది .
ఇప్పుడు యోగి జీవనం అనుభూతమవాలి .
మనసును బహిర్ముఖంగా భోగభాగ్యాల వైపు వాడితే అసంతృప్తి .అశాంతి .
అదే మనసును వైరాగ్యభావనతో తనలోకి తనను తాను అన్వేషించే దిశగా వాడితే విశ్వరహస్యం
బోధపడుతోంది .
యోగి తానే భోగి తానే .
రెండు లేవు ఉన్నది ఒకటే .
అరిష్వర్గాలను వదులుకుంటూ
ఇంద్రియ సౌఖ్యాలను వదులుకుంటూ ఇవి వదలాలంటే దైవీ లక్షణాలను అనసరించాలి .
భగవద్గీతలోని దైవాసుర సంపత్తి విభాగయోగమును అనుసరించి నిత్యజీవనంలో జీవించాలి .
సహజం చేసుకోవాలి .
దివ్యలక్షణాలు సహజస్వభావమయినప్పుడు
తనహితం ఉండదు .
పరహితమే తన హితమవుతుంది .
మానవదైవమేతానవటము .
ఈశ్వరలక్షణాలతో జీవించి ఈశ్వరుడే తానవటం .
ఈ ఉపాధి ఈశ్వరుడి చేతిలో పనిముట్టు .
ఈశ్వరుడే ఈ ఉపాధిద్వారా పని చేస్తాడు .
ఇది దివ్యజీవనం.
ఆదర్యవంతమైన జీవనం .
దీనితరువాత నవజీవనం.
యోగి కావటానికి అడవులలోనికి వెళ్ళనవసరం లేదు .
ముక్కు మూసుకుని తపస్సు చేయనవసరంలేదు .
సంసారం లోనే ఉండి అనగా ఈ మనోబుద్దులు , ఇంద్రియ విషయాలు అనే సంసారంలోనే ఉండి వాటికి అంటక అసంగుడిగా ప్రపంచములో వ్యవహరించటమే నవజీవనం.
కాబట్టి ఇప్పుడు నవజీవనం అంటే అవతారతత్వం తెలవాలి .
దైవీమానవుడి తత్వం , తెలవాలి .
ఇదితెలిస్తే విశ్వరహస్యం సంపూర్ణంగా బోధ పడుతుంది .
అవతార్ మెహర్ బాబా ఈ విధమైన నవజీవనాన్ని వారి శిష్యవర్గంతో జీవించేసారు .
ఏకకాలంలో భోగ జీవనాన్ని యోగి జీవనాన్ని జీవింపచేసి
నవజీవనాన్ని స్థాపించారు .
అంతటా ఉండాలి .
అన్నిట్లో ఉండాలి .
అంటక ఉండాలి .
అసంగుడై ఉండాలి .
ఉండీ లేని వాడుగా ఉండాలి లేక ఉండాలి .
ఇది నవజీవనం .
దీనికి నాశం లేదు .
యోగి యనుట కనరాదమ్మా
మరి భోగియనుటకది లేదమ్మా
యోగిభోగి ఉద్యోగములంటని
భాగవతాన్వయ గురునకు
మంగళ మనరమ్మా
శోక భోజనుడు .... మనసు లక్షణములతో కూడి , శరీరమే తానను తాదాత్మ్యము వలన .... ఈ కల్పిత శరీరము కోసము ఎంత సంపాదించినా చాలదు.
కల్పిత వస్తువులన్నీ మనసు యొక్క ఆకారాలే.
అందువల్లనే తృప్తి కలుగటంలేదు.
ఇదంతా అజ్ఞాన జనితము.
పరమాత్మ జ్ఞానమే సకల అజ్ఞానపు నాశనం.
పరమాత్మను తెలుసుకోవడానికి ఆరాటపడు.
పరమాత్మ ప్రాప్తికి నీ సమస్త ప్రయత్నాన్నీ వినియోగించు.
పరమాత్మ ప్రాప్తియే సకల కామప్రాప్తి.
సకల కర్మ నివృత్తి కూడా అదే.
ఈ రహస్యం తెలుసుకోవడమే దివ్యజీవనానికి నాంది.
నా కొరకు చేసినపని స్వార్ధపూరితము.
అదే సమాజహితము కొరకు చేయు నిష్కామ కర్మయే యజ్ఞము.
విశ్వ శ్రేయస్సుకై సమర్పణ బుధ్ధి తో చేయబడేది యజ్ఞము.
అదే దివ్యజీవన యజ్ఞము.
ఆ మనస్సులో వాసనలు ముద్రలు ఉండవు.
ఉచ్చ్వాస నిశ్వాసములలో సమముగా సామ్యమును సాధించిన యోగికి ప్రాణ మనసులు ఏకమై ఘర్షణ లేదు.
దినచర్య అంతా యజ్ఞార్ధముగా జరిగి సమస్త కల్మషములు ప్రక్షాళన జరుగుతుంది.
మనసు పరమేశ్వరుని దయ అనే నది నుండి సద్గురువు అనే కాలువను తవ్వుకొని , నా క్షేత్రానికి అతని ప్రేమామృతాన్ని ప్రవహింపచేసుకోవాలి.
దానివలన నాలో సద్గుణాలనే పంట పుష్కలముగా పండుతుంది.
పరమేశ్వరుని మూలరూపాన్ని చూడలేము.
అయితే అతడే సద్గురువురూపములో చేసే బోధను శ్రధ్ధగా వింటే అతని సగుణరూపాన్ని కావచ్చు నిర్గుణరూపాన్ని కావచ్చు చూడటం కష్టమేమీ కాదు.
తీర్ధాన్ని కేవలం నీరు అని భావిస్తే అది దాహాన్ని మాత్రమే తీరుస్తుంది.
విగ్రహాన్ని రాతిదనో , లోహమనో భావిస్తే అంతమాత్రమే ప్రయోజనం కలుగుతుంది.
మంత్రాన్ని కేవలం శబ్దమని భావిస్తే అది ఒక ధ్వని మాత్రముగానే వినిపించగలుగుతుంది.
అలాగే సద్గురు మూర్తిని మానవమాత్రుడిగా భావిస్తే వారు సాధారణవ్యక్తిగా మాత్రమే ప్రయోజనాన్ని చేకూర్చగలరు.
"గురు బ్రహ్మ గురు ర్విష్ణు: గురుర్దేవో మహేశ్వర:
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ: "
అనుకున్నప్పుడు దివ్యజీవనం నవజీవనమై శోభించింది.
నీకు ఆధారముగా ఒక ఆనందపు ఊట ఉంది.
దానికి భగవంతుడనీ , సచ్చిదానందుడనీ పేరు.
ఆ మూలము వైపుకు , ఆ ఆధారము వైపుకు ఒకసారి తిరిగితే నవజీవనము శాశ్వతమౌతుంది .
పరమపద సోపానక్రమములో ఎన్ని పాములున్నప్పటికీ , లక్ష్యాన్ని చేర్చగలిగేది దేశికేంద్రుల , సద్గురువుల కృప.
ఇంట్లో మనం గిన్నెలు సర్దుకునేటప్పుడు ఒక పెద్దగిన్నె వచ్చి ఒక చిన్న గిన్నెను కొట్టుకుందనుకోండి ఏమన్నా గిన్నె దుఃఖపడిందా?
గిన్నెకు ప్రాణం లేదుగా అనుకోకండి.
మనకు కనపడడం లేదు అంతే.
మనకు ఉన్నట్లుగా ఆ గిన్నెకు ప్రాణం లేదు అంతే.
గిన్నెలో వుండే చైతన్యం ఆ గిన్నెకు వుండబట్టే దానికి గిన్నె అనే ఆకారం వుంది.
లేకపోతే ఆకరం ఉండదుగా?
ఆ గిన్నె అనే ఆకారం చెడకుండా వుంచేటటువంటి శక్తి లోపల లేకపోతే గిన్నె ఆకారంలో ఎలా వుంటుంది, వుండదు కదా మరి.
కాబట్టి నీ యందు ప్రాణ శక్తిగా వున్నది,
దాని యందు చైతన్యం జడశక్తిగా వున్నది.
ఎదుటివారు దూషిస్తున్నప్పుడు నన్ను కాదు అనుకోవడం - అనేది కాదు ఇక్కడ గుర్తు పెట్టుకోవలసినది.
ఆ దూషిస్తున్నవాడు నా ప్రతిబింబం,
అతను ఎక్కణ్ణుంచో రాలేదు.
నాలో వున్న ప్రాణమనోబుద్ధులలో వున్న రజోగుణమే, అతనిలో పనిచేస్తోంది.
అతనిలో వున్న రజోగుణాన్ని నిద్ర లేపుతోంది,
అతను అలా ప్రవర్తించేటట్లు చేస్తోంది.
నా సూక్ష్మాన్ని ముందు సరి చేయాలి.
నాలో వున్న ప్రాణమనో బుద్ధులలో వున్న రజోగుణాన్ని కనుక ముందు నేను వదిలేసుకుంటే,
మూడు గుణాలలో కనుక నాకు స్పందన లేకపోయినట్లయితే, అతను అసలు అనే పరిస్థితే రాదు.
నిన్ను ఒకరు బాధిస్తున్నారు అంటే నీ లోపల సూక్ష్మం వారిలో చేరింది అని అర్ధం.
ఆ గిన్నెలో నీ ప్రాణ మనో బుద్ధులే వెళ్ళి చేరినాయి.
నీ సూక్ష్మం వెళ్ళి అతని సూక్ష్మంతో సంయోగం చెందింది.
ఉదాహరణ:
మీకు రమణ మాస్టారు ఎందుకు నచ్చరు?
ప్రపంచంలో ఇంతమంది వుండగా ఆయననే ఎందుకు వివాహం చేసుకున్నారు?
మీది పెద్దలు నిశ్చయించిన వివాహం అయినా సరే,
మీ తల్లిదండ్రులలో కూడా ప్రాణమనో బుద్ధులు అనే సూక్ష్మం వుంది కదా!
ఆ సూక్ష్మం మరొక జీవిలో, మరొక ఉపాధిలో వున్న సూక్ష్మంతో సంయోగం చెంది, వివాహం నిర్ణయం చేసింది.
కానీ అసలు నిర్ణయం అంతరాత్మ చేయాలి.
సాక్షి చేయాలి నిర్ణయం ఎప్పుడూ కూడా.
కానీ ప్రాణ మనో బుద్ధులు శాస్త్ర వాసన, దేహ వాసన, లోకవాసనకు లోబడి నిర్ణయాలు చేసేస్తున్నాయి.
కాబట్టి తప్పు నాదే,
ఎందుకంటే నిర్ణయాలు ఎప్పుడు అంతరాత్మ చేయాలి.
నేను గమనించే వాడిని సాక్షిని.
ఎదుటివారిలో వున్న అంతరాత్మగా అక్కడ గమనించేవాడిని నేనే.
ఇక్కడా నాలో గమనించేవాడినే.
ఆ గమనించేవాడి దృష్ట్యా చూస్తే ఇద్దరు లేరు కదా,
ఒక్కడే వున్నాడు. మరిప్పుడు ఎవరు ఎవరిని దూషిస్తున్నారు?
ఎవరూ ఎవరిని ఏమీ అనలేదు!
పరిణామ సూత్రం మేరకు, ఒకరి సహాయంతో ఒకరిక్కడ పరిణామం చెందుతూ వున్నారు.
ఒకరి ద్వారా ఇంకొకరు పాఠం నేర్చుకుంటున్నారు.
ఒకరికొకరు గురుశిష్యులుగా బోధ జరుగుతుంది.
నాలో ఉన్న రజోగుణాన్ని, నాకు నేనేగా తెలుసుకునే అవకాశం లేదు కాబట్టి, పరమాత్మ నాలాంటి జీవులనే నా చుట్టుపక్కల ఏర్పాటు చేసారు.
నాలో వున్న రజోగుణాన్ని వారు ఎత్తి చూపుతున్నారు.
నాలో వున్న తమో గుణాన్ని వారు ఎత్తి చూపుతున్నారు.
ఎందుకని అంటే వారు లేకపోతే నీవు తెలుసుకోలేవు.
నీలోపల నువ్వు ఎంతసేపు తొంగి చూసినా అవి కనపడవు కదా.
అవి ఎదుటివాడి అంతఃకరణంలో ప్రతిబింబిస్తేనే కదా మనం తెలుసుకోగలం.
అద్దం ముందుకు వెళ్ళి నిలబడితేనే కదా నీవు దానిని చక్కదిద్దుకునేది?
కాబట్టి వాడు నీ ప్రతిబింబం.
అద్దంలో కనపడుతున్న ప్రతిబింబం, నీ ప్రతిబింబమే అది.
నీలో ఎంత రజోగుణం బలంగా వుందో,
వారు అంత బలంగా మాట్లాడుతున్నారు.
నీలో తమోగుణం ఎంత బలంగా వుందో, వారు అంత తీవ్రంగా ప్రవర్తిస్తున్నారు.
నీలో సత్వగుణం ఎంత బలంగా వుందో, వారు అంత సత్వగుణంతో ప్రవర్తిస్తున్నారు.
ఒకోసారి నా ప్రమేయం లేకుండానే వాళ్ళు అలా ప్రవర్తిస్తుంటారు కదా అని మనం అనుకుంటాం.
అయితే "నా ప్రమేయం" అంటే ఇప్పటి వరకూ మనం శరీరం మాట్లాడడం వరికే పెట్టుకున్నాము.
శరీరం మాట్లాడక పోయినా, ప్రాణ మనో బుద్ధులు పనిచేస్తున్నాయి కదా.
అంటే మనం మౌనంగా కూర్చున్నా, మన ప్రాణ మనో బుద్ధులు పనిచేస్తూనే వున్నాయి.
నోరు కట్టేసినంత మాత్రాన, అవి కట్టుబడలేదు కదా, అవి పనిచేస్తూనే వున్నాయి కదా.
అలాగే మన ప్రాణ మనో బుద్ధులు, ఎదుటివారి శరీరంలోకి వెళ్ళి అలా పనిచేస్తున్నాయి.
కాబట్టి నా ప్రమేయం లేకుండానే సూక్ష్మ శరీరం పనిచేస్తుంది.
స్థూలంతో సూక్ష్మానికి ఏమీ పని లేదు.
మీరు కల కంటున్నారనుకోండి,
మీ స్థూల శరీరానికి ఆ కలతోటి ఏమైనా పని వుందా?
కల జరిగిపోతూనే ఉంటుంది కదా.
అట్లాగే మెలకువలో వున్నప్పుడు మీరు శరీరాన్ని మాత్రమే గుర్తిస్తున్నారు,
కానీ శరీరం కంటే ముంద సూక్ష్మం మేల్కొంటుంది.
స్థూలం కంటే, సూక్ష్మమే ముందు మేల్కొంటుంది.
కాబట్టి సూక్ష్మం మేలుకొన్నాకే కదా, ఈ స్థూలం మేలుకొంటుంది?
కాబట్టి ఈ స్థూలం పని చేస్తున్నది అంటే ఆ సూక్ష్మం పనిచేస్తుంటేనే కదా!
కాబట్టి ఈ సూక్ష్మం ఎప్పుడూ ముందు ఉంటుంది.
ఎదుటి వ్యక్తిలో నుంచి మాట్లాడుతున్న సూక్ష్మం ఇప్పుడు నీ సూక్ష్మమే.
వారిలో నుంచి ప్రవర్తిస్తున్న సూక్ష్మం నీ సూక్ష్మమే.
ఎదుటి వ్యక్తిలో నుంచి పనిచేస్తున్న కర్మ నీ సూక్ష్మమే.
ఈ ప్రక్రియ వలన వస్తున్న పరిణామం ఎవరికి?
నీ వల్ల నీకే కలుగుతోంది.
రెండోవారు ఎక్కడున్నారు ఇక్కడ? ఎవరూ లేనే లేరు ఎప్పుడూ కూడా.
మనం ఎప్పుడూ కూడా ఇతరులను వేరుగా చూడడమే ఇప్పటి వరకూ అలవాటు పడ్డాము.
నేను వేరు,
నువ్వు వేరు.
నేను వేరు, నువ్వు వేరు అనే భావం మనం మార్చుకోవాలి.
నీలో వున్న ప్రాణ మనో బుద్ధులు, ఎదుటి వ్యక్తిలో వున్న ప్రాణ మనో బుద్ధులు ఒక్కటే.
ఎవరు ఎవర్ని బాధ పెడుతున్నారు?
ఎవరూ ఎవర్నీ బాధ పెట్టడంలేదు.
గిన్నె గిన్నెను అన్నదండి.
గిన్నెను గిన్నె అంటే గిన్నెకు ఏమైంది?
ఇంకొకటి, అలా అనడం నాకు వుపయోగమే.
ఎందుకని అంటే ఆ వ్యక్తి నాకు గురువై బోధిస్తూఉన్నారు.
లేకపోతే నన్ను నేను తెలుసుకునే అవకాశం లేదు కదా?
ఈ మనుషులు ఎవ్వరూ మన చుట్టూ లేరు అనుకోండి
మనం మన గుణమాలిన్యాన్ని ఎలా తెలుసుకుంటాము,
సాధ్యమేనా?
మనకు ఎప్పటికైనా జ్ఞానం కలిగే అవకాశం వుందా?
వారు ఉండబట్టేగా మనకు పోలిక తెలిసేది.
ఆ పోలికే లేకపోతే దేనితో పోల్చుకుంటాము,
మన పరిణామం ఎలా సాధ్యం?
ఈ ప్రపంచంలో ఒకవేళ మీరు ఒక్కరిగా ఏకాకిగా వున్నారనుకోండి
జ్ఞానం ఎలా వస్తుంది?
కాబట్టి పరమాత్మ ఎంతటి ముందుచూపుతోటి ఈ సృష్టిని రచించారో ఆలోచించండి.
మీరు ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేకుండా మీకు మొత్తం గురువులనంతా మీ చుట్టూనే ఏర్పాటు చేసారు.
ఆ పరమాత్మా. తెలుసుకోగలిగే తెలివి, జ్ఞానం కనుక మీకు వున్నట్లయితే, మీరే కదా సత్యం.
మీరు సత్యమని, సాక్షి అనీ తెలుసుకోవాలి అంటే, మీ చుట్టూ వున్న వీళ్ళందరూ అవసరమేనా కాదా?
అందుకే కదా మీ వాసనాబల ప్రభావం మేరకు, వీరందరినీ ఏర్పాటు చేసుకున్నారు.
ఒక్కొక్కారు ఒక్కో ప్రతిబింబం.
ఒకరు రజోగుణానికి ప్రతిబింబం,
ఒకరు తమో గుణానికి ప్రతిబింబం,
ఒకరు సత్వగుణానికి ప్రతిబింబం.
ఒకరు సాక్షికి ప్రతిబింబం.
ఇలాగ ఎందుకని అంటే అందరూ అవసరమే.
మీ చుట్టుపక్కల వున్న అందరూ గురువులే, మీరు శిష్యుడు.
"ఈ సృష్టి నాకు గురువై బోధిస్తూ వున్నది.
నేను శిష్యుడనై, సాధకుడనై నేర్చుకుంటున్నాను" అని ఎప్పుడైతే ఈ సృష్టిని గురువుగా స్వీకరిస్తావో, ఆనాడు నువ్వు కడతేరుట ఖాయము.
బాగా గర్తుపెట్టుకోండి ఇదే వాక్యము.
ఈ సృష్టి గురువై బోధిస్తున్నదని ఎవరైతే స్వీకరిస్తారో,
ఆ జన్మలో వారు కడతేరుట ఖాయము.
ఎందుకని అంటే వారు జనన మరణాలను అధిగమించేస్తారు.
కారణం ఏమిటి అంటే సృష్టిని అధ్యయనం చేశారు.
తనని తాను అధ్యయనం చేశారు.
సృష్టిని, తనని ఏకంగా సాక్షిత్వంగా అధ్యయనం చేశారు.
పరమాత్మ నిర్ణయంగా సృష్టిలో జీవించేస్తారు ఇక.
ఎందుకని అంటే సృష్టి అతనిని బాధించలేదు. ఎందుకని?
గురువై బోధిస్తున్నది అది. ఇంకా బాధించేది ఏముంది?
శిక్షణను ఇస్తోంది, మంచి ట్రైనింగ్ ఇస్తోంది.
మంచి పాఠం వచ్చేట్టు చేస్తోంది. జన్మ జన్మలకి గుర్తుండే పాఠాన్ని ఇస్తోంది.
మరి అదే కదా జ్ఞానం అంటే.
ఆ జ్ఞానం ఎలా వచ్చింది?
ఆ సృష్టి నుంచే వచ్చిందిగా. సృష్టి గురువై బోధిస్తూ వుండగా, ఒక తలకాయి, రెండు కాళ్ళు, రెండు చేతులు వున్న గురువు కోసం ఎక్కడని వెతుకుతావు.
వెయ్యికోట్ల జనాభాలో ఎక్కడ ఉన్నారని ఎలా వెతుకుతావు?
ఈ సృష్టే ఈశ్వరుడు.
ఈ సృష్టే పరమాత్మ.
ఈ సృష్టే గురువు.
పరమపద సోపాన క్రమములో , ఈ పది మెట్లు అధిరోహించి , దశముడు తానేనను స్థిర నిర్ణయమునకు రావటము లో , సాధకుడి లక్ష్యం పరిపక్వత దశకు చేరుకొను క్రమములో ......
అంత:కరణ కదలికలను గుణాలకు సంబంధిచినవి గా గుర్తించి ,
అనుకూలముగా కాని ప్రతికూలముగా కాని స్పందించటం వదలాలి ....
ఎదుటివాడు రజో గుణంలో ఉన్నప్పటికీ గుర్తించి ,
మనము సత్వగుణములోనే ఉండగలగాలి.
శబ్ద స్పర్శ రూప రస గంధము లైన పంచ విషయములలో దేనియందు బలహీనత ఉందో తెలుసుకుని దానికి వ్యతిరేకముగా చేసే అభ్యాసం సాధన చెయ్యాలి.
సుఖ దు:ఖములకు అతీతమైనది ఆత్మ అని తెలిసి , పైనుండి చూసినప్పుడు నేను సర్వ వ్యాపక చైతన్యము గా అంతటా తననే చూస్తాడు.
పెద్ద స్వామి వారు చెప్పే ఎదుటి వాడిలో కూడా నిన్నే చూస్తావు.
వ్యవహారం జరుగుతుంది,
ఆత్మనిష్టుడు వ్యవహారాన్ని తనకన్న అన్యముగా చూడడు.
వ్యవహారము కర్త , భోక్త లేకుండ ఈశ్వరుడు గా జరుగుతుంది.
సమస్త సృష్టిని గురురూపముగా చూడగలిగినప్పుడు , కుటుంబ సభ్యులందరూ గురువులే.
నా లోని అనేకజన్మార్జితమైన జీవ సంస్కారాలు గుర్తింపచేసిన వారందరూ గురువులే. అదే మనసుతో ఉంటే జీవభావమే.
మనసుకు వేరైతే అక్కడే దైవత్వం ఆవిష్కరింపబడి ఆత్మకు దగ్గరవుతాము.
పానీయంబులు ద్రావుచుం గుడుచుచున్ భాషించుచున్ హాసలీ
లా నిద్రాదులు సేయుచుందిరుగుచున్
లక్షించుచున్ సంతత
శ్రీ నారాయణ పాదపద్మ యుగళీ
చింతామృతా స్వాద సం
ధానుండై మరచెన్ సురారిసుతుం
డేతద్విశ్వమున్ భూవరా !!
భావము : ధర్మరాజా ! మహాను భావుడైన ప్రహ్లాదునికి మంచినీరు త్రాగేటప్పుడు , మాటలాడేటప్పుడు ఆ మాధవుని చింతనే.
ఆహారం తీసుకునేటప్పుడు, ఆటలాడేటప్పుడు కూడా ఆ అచ్యుతుని స్మరణే. నడుస్తున్నా , నవ్వుతున్నా నారాయణ ధ్యానమే.
చివరకు నిద్రలో కూడా ఆ నీరజాక్షుని కలవరింతలే.
అన్నారు పోతనగారు భాగవత పద్యములో.
ఏది చెయ్యాలన్నా లక్ష్యాన్ని బాగా విచారణ చెయ్యాలి.
సంస్కార బలము రద్దు చేసుకునే విధముగా అకర్తగా చెయ్యాలి.
Let us complain less and give more
అనేది ఆచరణ సాధ్యం కావాలంటే ఎదుటకు వచ్చిన దానిని పూర్ణ అగీకారంతో స్వీకరించి , సందర్భోచితంగా ఎదగాలి,
అనాయాసేన మరణం వినాదైన్యేన జీవనం ,
దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పార్వతీ పతే
అని వేడుకుంటున్నాను.
సద్గురువుల కృపతో లక్ష్యమున కు చేరుకొనీ ,
అంది పొంది మీరగలనని విశ్వసిస్తున్నాను.
- స్వస్తీ...