Type Anything.., You Get World Wide Search Results Here. !

అట్లతద్ది నోము - Atla Tadde Nomu Special

 అట్లతద్ది నోము ఎలా చేసుకోవాలి? విధి విధానాలు ఏమిటి?

అట్లతద్దోయ్‌, అట్లతద్దోయ్‌!

ముద్దపప్పోయ్‌, మూడట్లోయ్‌!

చిప్పచిప్ప గోళ్లు, సింగరయ్య గోళ్లు;

మా తాత గోళ్లు, మందాపరాళ్లు!


అట్లతద్ది లేదా అట్ల తదియ తెలుగువారి ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఆడవారి ఆనందాల వేడుక అట్లతద్ది. ఇది ఆశ్వయుజ బహుళ తదియ నాడు జరుపుకొంటారు. “అట్లతద్ది ఆరట్లు ముద్దపప్పు మూడట్లు” అంటూ ఆడ పడుచులకు బంధువులకు ఇరుగు పొరుగులకు వాయినాలివ్వటం పరిపాటి.


అట్లతద్ది నోము ప్రాముఖ్యత

గౌరీదేవి (పార్వతీదేవి) శివుని భర్తగా పొందాలనే కృత నిశ్చయంతో ఉందని త్రిలోక సంచారి అయిన నారదుడు తెలుసుకున్నాడు. ఆమె కోరిక ఫలించాలంటే అట్లతద్ది వ్రతం చేయమని నారదుడు పార్వతీదేవికి సూచించాడు. ఆయన ప్రోద్బలంతో పార్వతీదేవి చేసిన వ్రతమే అట్లతద్ది. ఇది స్త్రీలు సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం. కన్నెపిల్లలు పడచువాణ్ణి పతిగా పొందాలనుకుంటే తప్పక ఆచరించవలసిన వ్రతమిది...


అట్లతద్ది నోము లో చంద్రారాధన ప్రధానం

అట్లతద్దె నోము స్రీలు సౌభాగ్యము కోసం చేస్తారు. ఈ నోములో చంద్రారాధన ప్రధానమైన పూజ. చంద్రకళల్లో కొలువైవున్నశక్తి అనుగ్రహం చేత స్రీసౌభాగ్యము పెరుగుతుంది. కుటుంబములో సుఖశాంతులు వర్ధిల్లుతాయని శాస్త్రవచనం.


అట్లు నైవేద్యం చేయడంలో అంతరార్ధం ఏమిటి?

అట్లతద్ది నోములో అమ్మవారికి అట్లు నైవేద్యముగా పెట్టడములో ఒక అంతరార్ధముంది. నవగ్రహాలలోని కుజుడుకి అట్లంటే మహాప్రీతి, అట్లను ఆయనకు నైవేద్యముగాపెడితే కుజదోషపరిహారమై సంసారసుఖములో ఎటువంటి అడ్డంకులు రావని నమ్మకము. రజోదయమునకు కారకుడు కుజుడు. కనుక మహిళలకు ఋతుచక్రం సరిగావుంచి ఋతుసమస్యలు రానివ్వకుండా కాపాడుతాడు. అందువలన గర్భధారణలో ఎటువంటి సమస్యలుండవు. మినపపిండి బియ్యపు పిండి కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువునకు, బియ్యము చంద్రునకు సంబంధించిన ధాన్యాలు. గర్భదోషాలు తొలగిపోవాలంటే ఈ రెండింటితో కలిపి తయారుచేసిన అట్లనే వాయనముగా ఇవ్వాలి. దీనివల్ల గర్భస్రావము కలుగకుండా, సుఖప్రసవం అయ్యేందుకు దోహదపడుతుంది కూడా. అందుకే ముత్తయిదువులకు అట్లను వాయనముగా ఇస్తారు.


అట్లతద్ది నోము ఎలా చేయాలి?

అట్లతద్ది నోమును ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా చేస్తారు. అంతేకాకుండా ఎవరి సాంప్రదాయాన్ని బట్టి వారు నిర్వహిస్తారు. ఎవరు ఎలా చేసినా అందులోని అంతరార్ధం మాత్రం ఒకటే. అందరూ సౌభాగ్యం కోసమే ఈ నోము చేస్తారు.

అట్లతద్దె ముందు రోజే ఈ నోము కోసం సిద్ధం కావాలి. అందుకోసం ముందురోజే అభ్యంగన స్నానం చేసి సంకల్పం చేసుకోవాలి. ఆరోజున మినపపప్పు, బియ్యం నానబెట్టి రెండు గంటల పాటు నానాక మెత్తగా రుబ్బి అట్లపిండి సాయంత్రానికల్లా సిద్ధంగా ఉంచుకోవాలి. అంతేకాక ముందురోజు ఒక ముత్తయిదువను వాయినానికి రమ్మని పిలవాలి. ముందురోజు ఆ ముత్తయిదువ ఇంటికి వెళ్లి కుంకుడుకాయలు, సున్నిపిండి, పసుపు ఇచ్చి బొట్టుపెట్టి అట్లతద్దె వాయినం తీసుకోవడానికి రమ్మని ఆమెను పిలవాలి.


గోరింటాకు ప్రాముఖ్యత

అట్లతద్ది నోములో గోరింటాకుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అట్లతద్దె ముందురోజున నోము చేసుకునే ఆడపిల్లలు చేతులకు, కాళ్ళకు గోరింటాకు అలంకరించుకోవాలి. గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి భర్త లభిస్తాడని పెద్దలు చెబుతారు. గోరింటాకు వాళ్ళు అలంకరించుకోవడంతోపాటు ముత్తయిదువకు కూడా ముందురోజే రుబ్బిన గోరింటాకు ముద్దను ఇవ్వాలి.


అట్లతద్ది నోము చేయవలసిన విధానం

అట్లతద్ది రోజున తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకున్నాక ముందుగా చద్ది అన్నం తినాలి. ముందురోజు రాత్రే సిద్ధంచేసి ఉంచిన ఉల్లిపాయ పులుసు, గోంగూర పచ్చడి, పెరుగు వేసుకుని అన్నం తినాలి. చెట్లకు ఊయలలు కట్టి ‘‘అట్లతద్దోయ్ ఆరట్లోయ్ ముద్దపప్పోయ్ మూడట్లోయ్’’ అంటూ సరదాగా ఊగటం, మనకు ఇష్టమైన ఆటలు ఆడడం చేయాలి. అంటే తిన్న అన్నం అరిగిపోయేలా ఆటలు ఆడాలన్నమాట. అంటే పిల్లలతో పాటు పెద్దలు కూడా ఆటలాడుకునే రోజు అట్లతద్ది. తరువాత ఇంటికి వచ్చి సూర్యోదయం సమయానికి తలస్నానం చేసి పూజాగదిని సిద్ధం చేసుకోవాలి. తరువాత దీపాలు వెలిగించి గౌరీపార్వతులను పూజించాలి. సాయంత్రం వరకూ ఉపవాసం ఉండాలి. సాయంత్రం ఐదు గంటలకు తిరిగి స్నానం చేసి పట్టుబట్టలు కట్టుకుని మనం సిద్ధంగా ఉంచిన అట్లపిండిలో కొద్దిగా బెల్లం కలిపి మందంగా ఉండేలా అట్లను సిద్ధం చేయాలి.

పదకొండు అట్లు అమ్మవారికి నైవేద్యానికి, మరో పదకొండు ముత్తయిదువకు వాయినానికి సిద్ధం చేసుకోవాలి. చంద్రోదయం అయిన తరువాత గౌరీదేవిని పూజించాలి. పూజాద్రవ్యాల్లో భాగంగా వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, అక్షతలు, మూడు తోరాలు సిద్ధం చేయాలి. ఈ తోరాలను పదకొండు ముడులు వేసి తయారుచేయాలి. వీటిలో ఒకటి అమ్మవారికి, మరొకటి నోము చేసుకునేవారికి వేరొకటి ముత్తయిదువకు.

తరువాత పసుపు ముద్దలతో గణపతిని, గౌరీదేవిని చేసి షోడశోపచారాలతో పూజించాలి. గణపతి పూజ అనంతరం వివిధ రకాల పుష్పాలు, పసుపు, కుంకుమలతో ఆ తద్దిగౌరీ దేవిని అర్చించాలి. తరువాత ధూపం, దీపం, నైవేద్యం, హారతి సమర్పించాలి. అట్లపైన బెల్లంముక్క, నెయ్యి వేసి, దీనితోపాటు ముద్దపప్పు, వరిపిండితో తయారుచేసిన పాలలో ఉండ్రాళ్ళు కూడా నివేదించాలి.

అట్లతద్ది పూజలో భాగంగా అమ్మవారి ఎదురుగా ఒక ఇత్తడి లేదా రాగి పళ్ళెంలో బియ్యం పోసి మన చేతులను ఎడమచేయిపై కుడిచేతిని పెట్టి రెండు చేతులతో బియ్యం తీసుకుని అత్తపోరు, మామపోరు, ఆడపడుచు పోరు, మగనిపోరు, ఇరుగుపొరుగు పోరు తనకు లేకుండా చూడాలంటూ ఆ గౌరీదేవిని ప్రార్థిస్తూ చేతులను మామూలు స్థితికి తెచ్చి బియ్యాన్ని ఆ పళ్ళెంలో తీస్తూ వదులుతూ ఉండాలి.

తరువాత మనం ముందుగా తయారు చేసి ఉంచిన తోరాలను అమ్మవారి వద్ద ఒక తమలపాకులో ఉంచి పూజించాలి. పూజ పూర్తయిన తరువాత ఒక తోరాన్ని అమ్మవారికి సమర్పించి మరొకటి తాము ధరించాలి. తోరబంధనం తరువాత అట్లతద్దె నోము కథను చదివి అక్షతలు తలపై వేసుకోవాలి. తరువాత అమ్మవారికి ఉద్వాసన చెప్పి అక్షతలు, నీళ్ళు ఒక పళ్ళెంలో వదలాలి. ఉద్వాసన అనంతరం మరునాడు గణపతితో పాటు గౌరీదేవిని దగ్గరలో ఉన్న నూతిలో కానీ, కాలువలో కానీ కలుపవచ్చు, లేదా నీటిలో కలిపి చెట్టుకు పోయవచ్చు, లేదా గుమ్మానికి అలంకరించవచ్చు లేదా ముఖానికి రాసుకోవడానికి వినియోగించవచ్చు.


వాయిన విధానం

అట్లతద్ది రోజు సాయంత్రం గౌరీ పూజ పూర్తయిన తరువాత ముత్తయిదువను అమ్మవారి ఎదురుగా ఒక ఆసనంపై కూర్చోబెట్టి ఆమెకు కాళ్ళకు పసుపు రాసి, కుంకుమ, గంధం అలంకరించాలి. తరువాత పదకొండు అట్లు, ముద్దపప్పు, పాలలో ఉండ్రాళ్ళ తో పాటు మంగళద్రవ్యాలు, రవికలగుడ్డతో పాటు వాయినం సమర్పించాలి. వాయినం తీసుకోవడానికి వచ్చే ముత్తయిదువలు కూడా ఉపవాసం ఉండాలన్న నియమం లేదు కానీ ఉండగలిగే వారు ఉంటే మంచిదే. వాయినం ఇచ్చేవారు ఒకరితో ఒకరు


ఇస్తినమ్మవాయినం

పుచ్చుకొంటినమ్మ వాయినం

నాచేతి వాయినం ఎవరు అందుకున్నారు

నేనమ్మా తద్ది గౌరీదేవి

కోరితిని వరం

ఇస్తినమ్మా వరం

అని పరస్పరం అనుకుంటూ వాయినం ఇచ్చి పుచ్చుకోవాలి. తరువాత ఆమె పాదాలకు నమస్కారం చేసి అక్షతలు వేయించుకోవాలి. ఇలా సాంప్రదాయం ప్రకారం ఈ నోమును పదకొండు సంవత్సరాల పాటు ఆచరించి ఆఖరు ఏడాది ఉద్యాపన చేసుకోవాలి.


అట్లతద్ది ఉద్యాపన విధానం

ఉద్యాపన కోసం అట్లతద్ది ముందురోజు పదకొండు మంది ముత్తయిదువలను వాయినం తీసుకోవడానికి రమ్మని పిలవాలి. అట్లతద్దెరోజు ఉపవాసం ఉండి 11 మంది ముత్తయిదువలను ఆసనాలపై కూర్చోబెట్టి వారికి పదకొండేసి అట్లు, బెల్లం ముక్క, ముద్దపప్పు, పాలలో ఉండ్రాళ్ళు, రవికెలగుడ్డ, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, నల్లపూసలు, నక్కజోళ్ళు, వాయినంతోపాటు ముత్తయిదువలకు అందరికీ అందించి వారిచే అక్షతలు వేయించుకోవాలి. ఈ అట్లను పలుచగా కాకుండా మందంగా వేయాలి. ఈ ఉద్యాపనతో అట్లతద్దె నోము పూర్తయినట్లు అవుతుంది.

పూజ అనంతరం చంద్రుని దర్శనం చేసుకుని మనం అమ్మవారికి నివేదించిన అట్లనే భుజించాలి. ఈ అట్లను నోము చేసుకున్న వారు మాత్రమే తినాలి.

- స్వస్తి...



 

Top

BOTTOM