Type Anything.., You Get World Wide Search Results Here. !

నాగుల చవితి.. ఎందుకు ? ఏమిటి ? ఎలా ? - Nagula Chavithi

 నాగుల చవితి.. ఎందుకు ? ఏమిటి ? ఎలా ?

సాధారణంగా కొన్ని ఏరియాలలో దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ జరుపుకొంటారు . కొందరు శ్రావణ శుద్ధ చతుర్థినాడు జరుపుకుంటారు.  ఈ రోజున చేసే నాగపూజలు విశేషమైన ఫలితాలను అందిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాల్లో చెప్పబడుతోంది. నాగుల చవితి మరుసటి రోజున వచ్చే నాగపంచమి రోజున వెండితోగానీ, మట్టితో గానీ నాగ ప్రతిమను తయారుచేసుకుని పంచామృతాలతో అభిషేకం చేస్తే మంచిదని శాస్త్రంలో తెలియజేశారు.


 ప్రకృతి మానవ మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవస్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని - ఇలా సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా చూసుకొంటూ! పూజిస్తూవస్తున్నారు. ఇదే మనభారతీయ సంస్కృతిలోని విశిష్టత. నిశితంగా పరిశీలిస్తే ... అందులో భాగంగానే ' నాగుపాము" ను కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు.


ఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి " నీటిని" ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే క్రిమికీటకాదులను తింటూ, పరోక్షంగా " రైతు " కు పంటనష్టం కలగకుండా చేస్తాయట!. అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి.


మన పురాణాలలో నాగుల చవితి గురుంచి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం.


ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెన్నుబాము' అని అంటారు. అందు కుండలినీశక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారమువలెనే వుంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ, మానవునిలో ' సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు ' నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివసించే ' శ్రీమహావిష్ణువు" నకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటలోగల అంతర్యమని చెప్తారు.


నాగేంద్రస్వామి సన్నిధిలో మట్టి ప్రమిదులు ఉంచి నువ్వుల నూనెతో ఏడు ఒత్తులను వెలిగించాలి. ఈ రోజున దీపారాధనకి నువ్వుల నూనెను ఉపయోగించడం అత్యంత శ్రేష్టమైనదని చెప్పబడుతోంది. అంతేకాకుండా భక్తిశ్రద్ధలతో నాగ సంబంధమైన స్తోత్రాలు చదువుతూ సుగంధభరితమైన పువ్వులను కూడా సమర్పించాలి. ఆ స్వామికి ఇష్టమైన చలిమిడి, వడపప్పు, అరటిపండ్లను నైవేద్యంగా పెట్టాలి.


నాగుల చవితి రోజు ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజచేసి చలిమిడి, చిమ్మిలి (నువ్వులతో చేస్తారు) అరటిపళ్ళు, తాటి బుర్రగుంజు , తేగలు మున్నగున్నవి నివేదన చేస్తారు.

ఈ నాగపంచమి రోజున పుట్టలో పాలుపోసి నాగేంద్రస్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి.


అలానే ఉపవాస దీక్షను చేపట్టాలి. అలాకాకుంటే నూనె తగలని పదార్థాలను మాత్రమే స్వీకరించాలనే నియమాన్ని తప్పకుండా పాటించాలి. ఈ విధంగా నాగపంచమి రోజున నాగేంద్రుడిని పూజించడం వలన సర్పదోషాలు తొలగిపోతాయని శాస్త్రంలో స్పష్టం చేయబడుతోంది. అంతేకాకుండా వివాహ యోగం, సంతాన భాగ్యం, సౌభాగ్య సిద్ధి కలుగుతాయి.


మన భారతీయుల చాల ఇళ్ళల్లో ఇలవేల్పు " సుబ్రహ్మణేశ్వరుడే ఆరాధ్య దైవంగా పూజిస్తారు కాబట్టి వారి పేరును చాల మంది నాగరాజు, ఫణి, సుబ్రహ్మణ్యం, సుబ్బారావు వగైరా పేర్లు పెట్తుకుంటూ ఉంటారు.


-స్వస్తి...



   

Top

BOTTOM