Type Anything.., You Get World Wide Search Results Here. !

పిండ ప్రదానం ఎందుకు చెయ్యాలి? - Pinda Pradanam yenduku Cheyyali?

పిండ ప్రదానం ఎందుకు చెయ్యాలి?

చనిపోయిన తరువాత జీవుడు ఏమవుతాడు? మనం పెట్టే పిండాలు వారికి ఎలా చేరతాయి? ప్రేత దేవతగా ఎలా మారుతుంది? పిండాల వల్ల ప్రయోజనం ఏమిటి? వీటికి సమాధానం కావాలంటే పిండోపనిషత్తును చదవాల్సిందే. ఇది అథర్వణ వేద శాఖకు చెందినది. ఈ వేదం ఎక్కువగా కర్మ యోగానికి చెందినది. ఇందులో నిత్యనైమిత్తికకామ్య యజ్ఞాలు ఎలా చేయాలో వివరించారు. 

చనిపోయిన తరువాత జీవుడు ఏమవుతాడు?

ఒకసారి బ్రహ్మదేవుడిని దేవతలు, మహర్షులు ''మృతులకు సమర్పించిన పిండాలను వారు ఏవిధంగా స్వీకరిస్తారు?'' అని ప్రశ్నించగా, దానికి బ్రహ్మ "దేహం, దేహి" గురించి వివరాలు చెప్పారు. 

మరణించిన తరువాత ఈ పాంచభౌతికమైన శరీరం నుండి పంచభూతాలూ విడిపోతాయి. ఈ శరీరం భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం అనే మహాభూతాలతో ఏర్పడింది. ఎప్పుడైతే దేహి శరీరం నుండి వెళ్లి పోతాడో, పంచభూతాలు కూడా ఎలా వచ్చినవి అలానే వెళ్ళి పోతాయి. 

ముందుగా గాలి వెళ్లి పోతుంది (ఊపిరి ఆగిపోతుంది). దాని వలన పంచప్రాణాలు పోతాయి. 

గాలి తరువాత అగ్ని వెళ్లి పోతుంది. శరీరం చల్లబడుతుంది. తరువాత వైశ్వానరాగ్ని వెళ్లి పోతుంది. 

తరువాత శరీరంలో ఉన్న నీరు తోలుతిత్తిలోని తొమ్మిది రంధ్రాల నుండి కారిపోతుంది. 

ఎప్పుడైతే గాలి, నిప్పు, నీరు శరీరం నుండి తప్పుకున్నాయో అప్పుడు భూతత్త్వం అయిన ధాతువులు ఎముకలు, వెంట్రుకలు, గోళ్ళు వంటి రూపంలో మాత్రమే మిగులుతాయి. కొన్ని రోజులకు ఇవి కూడా భూమిలో కలిసిపోతాయి. 

ఈ శరీరాకాశం మహాకాశంలో కలిసిపోతుంది. 

ఇదే పంచభూతాలు వెళ్లిపోయే విధానం. నిజానికి మనకు కనిపించే స్థూలమైన బాహ్య శరీరంతో పాటుగా ప్రతీ ఒక్కరికీ కారణ శరీరం, యాతనా శరీరం అని మరో రెండు శరీరాలు ఉంటాయి. 

కారణ శరీరం: మరో జన్మకు మనం చేసుకున్న పాపపుణ్యాల సంచులు మోసే శరీరం. ఇది తన సంచుల్లో ఉన్న పాపపుణ్యాల ప్రకారం మరో శరీరం వెతుక్కుంటూ వెళ్లి పోతుంది. ఇదే నూతన శరీరం పొందుతుంది. 

యాతనా శరీరం: ఇది స్వర్గానికో లేక నరకానికో  వెళ్తుంది. 

ఇలా వివిధ శరీరాలు ఎవరి దోవన అవి వెళ్లిపోతే మృతుని ప్రేత మిగిలి ఉంటుంది. ప్రేత పదిరోజుల పాటు తన ఇల్లూ, తన పరివారం, తన ఆస్తులు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో వేసే నిత్యపిండం కాకి రూపంలో వచ్చి తీసుకుంటుంది. దీని తరువాత పదవ రోజున సపిండులు, సగోత్రీకులు, బంధువులు, స్నేహితులు వచ్చి వదిలే ఉదకాలు దాని దాహాన్ని తీరుస్తాయి. వీటికి తృప్తి పడి అది పది రోజుల తరువాత తన వారిని, నా అనుకునే వారిని వదిలి వెళ్తుంది. 

మనం పెట్టే పిండాలు వారికి ఎలా చేరతాయి?

ప్రేతకు కావలసిన క్రొత్త శరీరం మాసికాల ద్వారా చేసే ఏకోద్దిష్ట శ్రాద్ధాల రూపంలో అందుతుంది. నిన్నటి బాహ్య శరీరాన్ని విడిచి, కారణశరీరం, యాతనా శరీరం కోల్పోయి, ప్రేతగా ఏ శరీరం లేకుండా ఉన్న మృతుడు మాసికాలలో కేవలం తనకు మాత్రమే ఉద్దేశించి వదిలే పిండాల ద్వారా క్రొత్త శరీరం సంతరించుకుంటాడు. 

మొదటి పిండం ద్వారా క్రొత్త శరీరానికి బీజం పడుతుంది. దీనినే కలనం అంటారు. 

రెండో పిండం వలన చర్మం, మాంసం ఏర్పడతాయి. 

మూడో పిండం వలన బుద్ధి కలుగుతుంది. 

నాలుగో పిండం వలన ఎముకలు, ఎముకల్లోని గుజ్జు ఏర్పడతాయి. 

ఐదో పిండం వలన శిరస్సు, ముఖం, వేళ్ళు ఏర్పడతాయి. 

ఆరో పిండం వలన హృదయం, మెడ, నోటిలోని భాగాలు ఏర్పడతాయి. 

ఏడో పిండం వలన ఆయుః ప్రమాణం  కలుగుతుంది. 

ఎనిమిదో పిండం వలన మాటకు చెందిన వ్యవస్థలు కలుగుతాయి. 

తొమ్మిదో పిండం వలన అన్ని అవయవాలకు పరిపుష్టి చేకూరి దృఢపడతాయి. 

పదో పిండం వలన క్రొత్త జీవితానికి అవసరమైన శారీరక పరిపూర్ణత చేకూరుతుంది. 

మాసికాలలోని పిండదానం వలన పిండ శరీరం నుండి సంపూర్తి శరీరం ఏర్పడుతుంది. ఈ ప్రపంచంలో భోగాలు అనుభవించడానికి మనకు శరీరం ఇచ్చిన తల్లి తండ్రులకు మాసికాలు నిర్వహించి, వారికి శరీరం ఏర్పడడానికి అవసరమైన పిండాలు సమర్పించి, వారి ఋణం తీర్చుకోవాలి. 

మొత్తంగా ఒక సంవత్సర కాలంలో 16 పిండాలు ఇస్తారు. వీటిలో మొదటి 10 పిండాల నుండి మృతుడు క్రొత్త శరీరాలు పొందుతాడని పిండోపనిషత్తు ద్వారా తెలుస్తుంది. మిగిలిన పిండాల గురించి గరుడపురాణంతో పాటు అనేక పురాణాలు చెబుతున్నాయి.

మృతుని శరీరం నుండి పంచభూతాలు ఏవిధంగా దూరం అవుతాయో అదే విధంగా తిరిగి వారికి భౌతిక శరీరం ఏర్పడడానికి పంచభూతాలూ కలుస్తాయి. ముందుగా జీవికి ఆస్తిక్యం ఇవ్వడానికి కారణం అయిన ఆకాశం అతనికి స్థలం ఇస్తుంది. ఆ తరువాత అగ్ని, జలం, వాయువు, భూమి తత్త్త్వాలు అతనికి శరీరం కల్పిస్తాయని పిండోపనిషత్తు చెబుతోంది. 

మాసికాలు ఇవ్వకపోతే ఏమవుతుంది?

మృతులకు మాసికాలు అన్నీ పెట్టవలసిందే. మాసికాలకు ప్రత్యామ్నాయం లేదు. ఏదైనా పిండాన్ని ఇవ్వకపోతే, అది ఎన్నో పిండమైతే ఆ దశలో ఏర్పడాల్సినవి ఏర్పడక మృతునికి వైలక్యం కలుగుతుంది. మాసికాలు మానేస్తే ఇటువంటి వైకల్యం కలుగుతుంది. 

సపిండీకరణం చేయకపోతే పితృదేవతా రూపం రాదు. తండ్రికి ప్రేతత్త్వం విడుదల చేయకపోతే తరువాత తరాలు అన్నీ ప్రేతత్త్త్వంలోనే ఉండిపోతాయి. కనుక మధ్యమ క్రియలైన మాసికాదులు చేయడం వలన చనిపోయిన వారికి మాత్రమే కాదు, కర్తకు కూడా లాభం చేకూర్చేదే. తనకు దుర్గతి రాకుండా మంచి మార్గం వేసుకోవడం వంటిది. ఇవి మన పురాణాలు, ఉపనిషత్తులు చెబుతున్న పితృయజ్ఞరహస్యాలు. 

ప్రేత పితృదేవతా స్థానం ఎలా పొందుతుంది?

పూర్వక్రియలు (దహన సంస్కారాది 12 రోజుల క్రియలు), మధ్యమ క్రియలు (మాసికాలు), సపిండీకరణం జరిగే వరకూ దేహాన్ని విడిచిన ఆత్మ ఈ ప్రేత రూపంలోనే ఉంటుంది. సపిండీకరణం తరువాత తన ముందున్న వర్గత్రయంలో తన తండ్రి తాత ముత్తాతల్లో ముత్తాతను ముందుకు జరిపి, ఆయన ఖాళీలో తాతను, తాత స్థానంలో తండ్రిని జరిపి, తండ్రి స్థానంలో తాను చేరుకుంటుంది. ఈ విధంగా పితృదేవతా స్థానం పొందుతుంది.

పుణ్య క్షేత్రాల్లో, పుణ్య తీర్ధాల్లో పిండ ప్రదానం చేస్తే ఏమవుతుంది?

కురుక్షేత్రం, ప్రయాగ, కాశీ, గయ వంటి పుణ్య క్షేత్రాల్లో పిండప్రదానం చేస్తే వారికి విశేషమైన శరీరాలు కలుగుతాయి. దాని వల్ల మనకే ప్రయోజం ఉంటుంది. వారికి కలిగే ఉత్తమ శరీరాల వల్ల పరమానందం పొంది మరింతగా సకల సంపదలు మనకు ఇస్తారు. 

ఇలా పుణ్య క్షేత్రాలలో చేయలేని వారు కనీసం తాను ఉన్న చోటునైనా పిండ ప్రదానం చేయాలి. వెళ్ళగలిగిన వారు ప్రయాగ కుంభమేళాల వంటి వాటికి వెళ్ళి చేయడం వలన దివ్యమైన ఫలితాలు పితృదేవతానందం వలన కలుగుతాయి. వెళ్ళలేని వారు మానసికంగా అయినా వాటిని కీర్తించడం వలన పుణ్యం పొందుతారు.

పిండాలు ప్రేతాలకు వెళతాయా? 

దీనికి సమాధానమే ఈ పిండోపనిషత్తు. నిజానికి ఉపనిషత్తులు అన్నీ రహస్యాల సమూహాలు. అవి పైకి ఒక అర్ధంలో కనిపించే సామాన్య పదాలుగా కనిపించినా వాటి వెనుక కేవలం మహాసాధకులకు మాత్రమే తెలిసిన అనేక రహస్యాలు ఉంటాయి. అవి కేవలం సాధకులు, పరిశ్రమ చేసిన విజ్ఞులు మాత్రమే అందుకోగలుగుతారు. వీటిని వారు అందరికీ చెప్పరు. కేవలం ఫలానా పిండదానాలు ఫలానా చోట చేయండి అని మాత్రమే చెబుతారు.  

పితృ పూజకు దివ్యమైన కాలం ఏది?

మాఘమాసం పితృదేవతా అర్చనలకు మహాదివ్యమైన కాలం. మాఘపౌర్ణమి/మహామాఘి రోజున పితరులకు ప్రయాగలో పిండ ప్రదానం చేస్తే దివ్యమైన ఫలాలు, సంపదలు కలుగుతాయి. ఆ సమయానికి వెళ్ళలేని వారు మానసికంగా అయినా తమ పెద్దలకు నమస్కరించుకొని, స్వధా నామ పారాయణం చేసి, స్వధా స్తోత్రం, పితృస్తోత్రం పఠించుకొని, ఆవుకు ఒక రోజు గ్రాసం వేయడం వలన కూడా ఉత్తమ పుణ్యసంపదలు ఉన్న చోటు నుండే పొందవచ్చు. ఇవే మాసికాల, పిండప్రదానాల రహస్యాలు.

Top

BOTTOM