ఆత్మపిండం అంటే ఏమిటి?
ఆత్మ పిండం... అంటే తమ పిండాన్ని తామే పెట్టుకోవడం..
పూర్వం తాను చనిపోయిన తరువాత శ్రార్ధ కర్మ చేసి, ఉత్తరగతులు కలిగించేవారు లేనివారు ఈ ఆత్మ పిండాన్ని పెట్టుకునేవారు.
ఆత్మ పిండం పెట్టుకోదలచినవారు ముందుగా బ్రహ్మకపాలాన్ని దర్శించి, అక్కడ తనకు తానుగా మరణానంతర కర్మలు (దీనినే ఘటా శ్రార్ధం అంటారు) చేసుకోవాలి. తరువాత కాశీ వెళ్ళి, విశ్వేశ్వరుని దర్శనం చేసుకుని, ప్రయాగలోని త్రివేణి సంగమంలో స్నానం చేసి, గయ వెళ్లి, అక్కడ మూడు చోట్ల పిండాలు పెట్టుకోవడం ఆచారం.
గయలో మొదటగా నదీ తీరంలోను, తరువాత విష్ణు పాదాల వద్ద, చివరగా అశ్వథ్థ వృక్ష మూలంలోనూ పిండాలు పెట్టడం ఆచారం.
ఆత్మ పిండం పెట్టుకున్నవారు తిరిగి ఇంటికిగానీ, మనుషుల్లోకిగానీ రాకూడదు. ఎటువంటి మంగళ కార్యాలకు హాజరు కాకూడదు. ఆశీర్వచనాలు ఇవ్వరాదు, తీసుకోరాదు. ఆత్మ పిండం పెట్టుకున్నవారు అన్ని రకాల ధార్మిక నియమాలను (జప, తప, దానాలు) పాటించాలి. మహాప్రస్ధానం వెళ్ళాలి. అంటే అడవుల్లోకీ, పర్వతాల్లోకీ వెళ్తూ సాధన చేసుకుంటూ గడపాలి.