Type Anything.., You Get World Wide Search Results Here. !

కరిమల వాసుని కథ వినరండి - Listen to the story of Karimala Vasu

 కరిమల వాసుని కథ వినరండి

కరిమల వాసుని కథ వినరండి కలిహరమిది కనరండి

కరిమల వాసుని కథ వినరండి కలిహరమిది కనరండి

తారకనాముడు కారణజన్ముడు ధరలో వెలసిన విధి తెలియండి

కరిమల వాసుని కథ వినరండి కలిహరమిది కనరండి


సత్యలోకమున భారతికి కైలాసమ్మున పార్వతికి

సతులందరిలో మహాపతివ్రత ఎవరని కలిగెను సందేహం

ఆదిదేవుడు, బ్రహ్మదేవుడు సతులను గూడి వైకుంఠం

చేరి విష్ణువుకు వెల్లడించిరి తమ తమ భార్యల సందేహం

చిరు చిరు నగవులు చివురులెత్తగా ముగురమ్మలకు దిగులు పుట్టగా

మహాపతివ్రత సతి అనసూయని మహావిష్ణువే వివరించే

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ


అలిగిన భామలు సతి అనసూయను పరీక్షించమని అడుగగా

ఎరిగిన తండ్రులు ఎరుక దాచుకొని అత్రి ఆశ్రమం చేరి

భవతి భిక్షాందేహియని నగ్నదేహిగా వడ్డించమని

ముగ్గురతిధులై ముంగిట నిలువ

ముసిముసి నవ్వుల వారి గని పసి పాపలుగా మార్చుకొని

భూతభవిష్యత్ వర్తమానముల మాతృజన్మ ఈడేర్చుకొని

మహాపతివ్రత అనసూయమ్మ హరిహరబ్రహ్మల ముద్దాడే


ఊయలలో… తమ పతులగని…

ఊయలలో తమ పతులగని ఉమకి,రమకి,భారతికి

అయిదోతనమే అయోమయంలో ఊగిసలాడెను ఒక్క క్షణం

ఊఊఊ..ఊఊఊఊ…ఊఊఊఊ


అపుడు పార్వతి, లక్ష్మి, సరస్వతులు మహాసాధ్వియైన

అనసూయను పతిభిక్షపెట్టమని ప్రార్ధించగా

ఆమె కరుణించి ఆ వరమిచ్చి ఆ త్రిమూర్తుల అంశతో

తమకొక కుమారుణ్ణి ప్రసాధించమని కోరింది


అత్రికి దత్తుడు దత్తాత్రేయుడు అనసూయమ్మకు ప్రియ సుతుడై

జననమందగా చతుర్వేదములు శునకములై అనుసరించగా

దేవ ధుందుభులు మొరసినవి సుమ మేగాలే కురిసినవి

వేదాంతానికి ఆదిభాష్యమై వెలుగురేకలే మెరిసినవి

సుమసుకుమారుడు దత్తాత్రేయుడు లీలావతినే పెళ్ళాడి

యవ్వనలీలా… రాగమాలికల రాసలీలలే ఆడే


కరిమల వాసుని కథ వినరండి కలిహరమిది కనరండి

కరిమల వాసుని కథ వినరండి కలిహరమిది కనరండి


లోకకంఠకుడు మహిషాసురినె లోకమాత వధియించగా

పతి శాపమ్మున్న పశువుగ పుట్టిన మహిషే పట్టమహిషిగా

శుక్రాచార్యుని ఆనతితో సక్ర పరాభవమే తన గురిగా

రాక్షషసకుల రక్షణ తనవిధిగా తపోదీక్షలో మునిగెను మహిషి…

తపోదీక్షలో మునిగెను


మహిషి తపస్సుకు మహి అల్లాడెను

దివిజలోకమే గిరగిర తిరిగెను

పాతాళపు భేతాళ ఘోషలే దశదిశాంతమ్ములు దద్దరిల్లెను

కాలమాగెను, నింగి రాలెను, చుక్కలు నెత్తురు కక్కసాగెను

ఒళ్ళంతా కళ్ళైన ఇంద్రునికి కన్నీరే అభ్యంగమాయెను

అపుడు మదనుడు కన్నులు తుడిచి ఆ దేవేంద్రుని ఊరట పరిచి

మహిషి తపమ్మును భంగపరచగా మహికి చేరెను తక్షణమే

మహికి చేరెను తక్షణమే


బ్రహ్మ వరమ్మున బలదర్పమ్ములు శృతులుమించిన ఆ మహిషీ..

సూర్యుని తన్నెను,చంద్రుని కుమ్మెను గగన వీధిలో గంతులేసెను

మహీచక్రమును మట్టగించెను ఇంద్ర పదవినే ఆక్రమించెను

మదమెక్కెన మహిషికింక మగడొకడే అని తెలిసిన

అరుని మనోవీధిలోన మెరిసెను దత్తాత్రేయుడు దత్తాత్రేయుడు


శుక్రాచార్యుని మిధునయాగమున కామజ్వాలలే అవతరించగా

మహిషిని పట్టిన కామప్రకోపం మండిపోయినది సమిధగా


కరిమల వాసుని కథ వినరండి కలిహరమిది కనరండి

కరిమల వాసుని కథ వినరండి కలిహరమిది కనరండి


మోహినిపై మరులుగొన్న శివలాస్యం

శివహృదయపు లయలుకన్న హరిలావణ్యం

మోహినిపై మరులుగొన్న శివలాస్యం

శివహృదయపు లయలుకన్న హరిలావణ్యం

కనులారా కనగలిగిన అద్వైతం

ఉదయించిన ధర్మశాస్త జీవనగీతం

మోహినిపై మరులుగొన్న శివలాస్యం


పూర్ణతో పుష్పలతో అతని వివాహం

అసంపూర్ణమైనది అతని ప్రణయజీవితం

శివునానతి తలదాల్చి భువిలో జనియించే శాస్త

లేకుంటే లేదుకద మహిషి కధ వధ

మోహినిపై మరులుగొన్న శివలాస్యం


పద్మదల రాజ్యాధినేత ఆ మాందాత

వేటలాడె వేడుకను సాగిరాగ

ఘోరాటవీదేశ కృరమృగ మధ్యస్థ

గిరి కందరాన ఒక పసికేక వినిపించె

శిశు రోదనము విన్న శ్రీమహీపాలకుడు

పసిమహావిష్ణువై

శిశువైన శివుడిలా బాలార్ధ తేజానగల

బాలకుని చూచి

ఆశ్చర్యచకితుడై అనురాగచలితుడై

బిడ్డపాపలు లేక గొడ్డుపోయిన జన్మ

అది మహాఫలముగా అరుదైన వరముగా

భావించి బాలకుని ఎత్తుకొని ముద్దాడి

తనయుడని ఉప్పొంగి తన రాణికివ్వగా

మణిమాలతో ఇంటి మణిదీపమై వచ్చి

మణికంఠుడను పేర పెరిగే బాలకుడు


గురుకుల విధ్యాభ్యాసంలో చెరసంధాన ప్రయోగంలో

సకలశాస్త్రముల సర్వశస్త్రముల పండితుడయ్యెను పసివాడు

గురుదక్షిణగా గురుపుత్రునికే వెలుగునిచ్చె మణికంఠుడు

ఇదే సమయమని మహిషి మర్ధనకు ఇదే తరుణమని

పందలరాణికి శిరోభారమును కల్పించెను దేవేంద్రుడు

రాజవైద్యుడిగ తానే వచ్చి పులిపాలు తప్ప

ఆ వ్యాధికి మందేలేదని చెప్పగా


తల్లి భాదకు తల్లడిల్లిన ఆ మణికంఠుడు

పాలుతెత్తునని ఘోరాడవికే బయలుదేరెనపుడు

కారణజన్ముడు మణికంఠుడికీ

జన్మరహస్యం చెప్పె ఇంద్రుడు


కర్మవీరుడై ఖడ్గహస్తుడై కాలరూపుడై

బాలవీరుడు మహిషిని వధియించగా

మనసా శిరసా నమస్కరించెను మహేంద్రుడు

మహిలో దివిలో వెల్లివిరిసెను కాంతిరేఖలు


శివశ్చ హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయగం శివః

సంధ్యావందన గీతం శివకేశవుల అనుబంధం

ఆదిశంకరుల అద్వైతం అదే శబరిగిరీశుని అవతారం

అదే శబరిగిరీశుని అవతారం


కరిమల వాసుని కథ వినరండి కలిహరమిది కనరండి

తారకనాముడు కారణజన్ముడు ధరలో వెలసిన విధి తెలియండి

కరిమల వాసుని కథ వినరండి కలిహరమిది కనరండి

కరిమల వాసుని కథ వినరండి కలిహరమిది కనరండి




   

Top

BOTTOM